నాడు వనిత, నేడు అనిత... మాజీ, ప్రస్తుత హోం మంత్రుల ప్లస్‌లు, మైనస్‌లు ఇవే..
Anitha Vangalapudi vs Taneti Vanitha: వంగలపూడి అనిత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి అయ్యారు. పోలీసుల నుంచి సకల గౌరవ మర్యాదలు అందుకుంటున్నారు. గతంలో అదే పోలీసుల నుంచి ఘోర అవమానాలు పొందారామె. హోం మంత్రిగా బాధ్యతలు చేపట్టాక అనిత మాట్లాడిన తీరు అందరినీ ఆకట్టుకుంది.
Anitha Vangalapudi vs Taneti Vanitha: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం మంత్రిగా అనకాపల్లి జిల్లా పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత పదవీ బాధ్యతలు చేపట్టారు. గత ప్రభుత్వ హాయంలో మహిళలపై అఘాయిత్యాలు జరగకుండా అడ్డుకోవాలని డీజీపీ కార్యాలయానికి వెళ్లేందుకు ప్రయత్నించగా... గేటు బయటే పోలీసులు అడ్డుకున్నారు. కనీసం వినతిపత్రాన్ని కూడా అందించేందుకు అనుమతివ్వలేదు. రోడ్డుపైనే నిలిపివేసి హెడ్ కానిస్టేబుల్‌కి వినతిపత్రం ఇచ్చి వెళ్లాలంటూ ఘోరంగా అవమానించారామెను. ఆ రోజు శపథం చేసినట్లే.. ప్రొటోకాల్‌తో డీజీపీ కార్యాలయంలోకి వెళ్లే స్థాయికి చేరారు వంగలపూడి అనిత. డీజీపీ కార్యాలయం గేటు దాటి లోపలికి పోనివ్వకుండా అడ్డుకున్న పోలీసులే సకల మర్యాదలతో ఆహ్వానించే రోజులు వచ్చాయి. దటీజ్ వంగలపూడి అనిత అనిపించుకుంటున్నారు.
హోం మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత వంగలపూడి అనిత మీడియాతో మాట్లాడారు. హోం మంత్రిగా తాను ఏం చేయబోతున్నానో స్పష్టంగా తన ప్రణాళిక వివరించారు. తన ముందున్న లక్ష్యాలను సూటిగా చెప్పారు. అయితే, గత ప్రభుత్వ హయాంలో హోం మంత్రులుగా పనిచేసిన మేకతోటి సుచరిత, తానేటి వనిత మీడియా ముందు మాట్లాడాలంటే ఆలోచించేవారు. ఏదైనా ఘటనపై మాట్లాడాల్సి వస్తే కనీస సమాచారం తెలుసుకోకుండా తడబడుతూ తప్పుల తడకగా మాట్లాడేవారు. స్క్రిప్ట్ ఉంటే మాత్రం చక్కగా చదివేసేవారు.
ఈ నేపథ్యంలో సోషల్ మీడియా నాటి హోం మంత్రి వనిత, ప్రస్తుత హోం మంత్రి అనితల మాటలు వైరల్ అవుతున్నాయి. హోం మంత్రిగా పదవి చేపట్టాక వారిచ్చిన ఫస్ట్ రియాక్షన్ దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ‘వనిత హోం మంత్రిగా పనిచేశారని తెలియకుండానే దిగిపోయారే..’ ‘గత ఐదేళ్లు చాలా కష్టపడ్డారు, ఇక రెస్ట్ తీసుకోండి’ అంటూ నెటిజన్లు సెటైరికల్ కామెంట్స్ చేస్తున్నారు.
అనిత ప్లస్‌లు....
వంగలపూడి అనిత వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి వచ్చారు.
వైసీపీ హయాంలో మంత్రులు, అధికార పార్టీల నేతలను ధీటుగా ఎదుర్కొన్నారన్న పేరుంది.
ఏ విషయంపైనే ధాటిగా మాట్లాడగల సామర్థ్యం ఉంది.
తొలిసారి హోం మంత్రి అయ్యాక ఎలాంటి స్క్రిప్ట్ లేకుండా సూటిగా ఆమె చేయబోయేది చెప్పేశారు.
గత ఐదేళ్లు పోలీసుల నుంచి అనేక అవమానాలు ఎదురైనా తట్టుకొని నిలబడి ఎదిగారు.
మహిళల సమస్యలపై పోరాటం చేసిన అనుభవం ఉంది.
ఉత్తరాంధ్ర ప్రాంత మహిళా నేతగా, తెలుగు మహిళా విభాగంగా రాష్ట్ర అధ్యక్షురాలిగా పనిచేశారు.
వనిత మైనస్‌లు....
హోం మంత్రిగా శాఖ బాధ్యతలు స్వతంత్రంగా నిర్వహించలేకపోయారు.
తన శాఖ గురించి మాట్లాడాల్సి వస్తే సీఎం జగన్ భజన చేయడం, వైసీపీని మళ్లీ అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తామనడం తప్ప వేరేది చెప్పరు.
హోం మంత్రిగా ఆ శాఖపై సమీక్షలు నిర్వహించింది చాలా తక్కువ.
అత్యాచార ఘటనలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం.
రాష్ట్రంలో వరుస అత్యాచార ఘటనలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి తీవ్ర విమర్శలకు గురయ్యారు.
తల్లుల పెంపకాన్ని బట్టే అత్యాచార ఘటనలు జరుగుతాయి, దుండగులు ఉద్దేశపూర్వకంగా బాధితురాలిపై అత్యాచారం చేయలేదు... అంటూ వనిత చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.
రాష్ట్ర వ్యాప్తంగా దూమారం రేపిన అత్యాచార ఘటనపై కనీస వివరాలు తెలుసుకోకుండా మాట్లాడి పోలీసులను, ప్రజలను విస్తుపోయేలా చేశారు.
వనిత కూడా ఆ తాను ముక్కే...
తానేటి వనిత కూాడా తెలుగుదేశం పార్టీ నేపథ్యం ఉన్నవారే. ఆమె 2009లో రాజకీయాల్లోకి వచ్చి.. టీడీపీ తరఫున తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం నుంచి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2012లో టీడీపీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి... వైసీపీలో చేరారు. ఆ తర్వాత 2014లో అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి తెలుగుదేశం అభ్యర్థి కేఎస్ జవహర్ చేతిలో ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో కొవ్వూరు నుంచి వైసీపీ తరఫున పోటీచేసి టీడీపీ అభ్యర్థి వంగలపూడి అనితపై విజయం సాధించారు. జగన్ కేబినెట్లో తొలుత స్త్రీ శిశుసంక్షేమ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 2022లో జరిగిన మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా హోం, ప్రకృతి విపత్తుల నివారణ శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు తానేటి వనిత.