Asianet News TeluguAsianet News Telugu

అవమానించారు, జగన్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తా: వంగవీటి రాధా

త్వరలో జరిగే ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ కు వ్యతిరేకంగా తాను ప్రచారం నిర్వహిస్తానని వైసీపీకి రాజీనామా చేసిన వంగవీటి రాధా ప్రకటించారు. 

vangaveeti radha sensational comments on ys jagan
Author
Amaravathi, First Published Feb 21, 2019, 7:20 PM IST


విజయవాడ: త్వరలో జరిగే ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ కు వ్యతిరేకంగా తాను ప్రచారం నిర్వహిస్తానని వైసీపీకి రాజీనామా చేసిన వంగవీటి రాధా ప్రకటించారు. పార్టీ నుండి తనను మెడపట్టి బయటకు గెంటేసే ప్రయత్నం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేందుకు జగన్ ప్రయత్నించారని వంగవీటి రాధా ఆరోపణలు చేశారు.

గురువారం నాడు వంగవీటి రాధా ఓ తెలుగు న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో  పలు విషయాలను వెల్లడించారు. వైసీపీని తనను మెడపట్టి బయటకు పంపే ప్రయత్నం చేశారని చెప్పారు. అయితే ఈ విషయాన్ని ముందే గమనించి తాను గౌరవంగా రాజీనామా చేసి బయటకు వచ్చినట్టు ఆయన చెప్పారు.

గత ఏడాది సెప్టెంబర్  11వ తేదీన విశాఖలో నిర్వహించిన పార్టీ సమావేశంలో తనను పార్టీ నుండి బయటకు పంపేయాలని ప్లాన్ చేశారని రాధా ఆరోపించారు. అయితే తాను ఈ విషయాలను పసిగట్టి గౌరవంగా రాజీనామా చేశానని వివరించారు.

తననకు వైసీపీ రాష్ట్ర యూత్ వింగ్ అధ్యక్షుడిగా, సిటీ అధ్యక్షుడిగా, చివరకు నియోజకవర్గ ఇంచార్జీగా బాధ్యతలు కట్టబెట్టి ఆ తర్వాత ఆ పదవులను లాక్కొన్నారని రాధా ఆరోపించారు. యూత్ వింగ్ అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించినా కనీసం కమిటీ ఏర్పాటు చేసుకోకుండా అడ్డుకొన్నారని చెప్పారు.

యూత్ వింగ్ తరపున స్వంతంగా కార్యక్రమాలను నిర్వహించే స్వేచ్ఛను కూడ ఇవ్వలేదన్నారు. కాపు రిజర్వేషన్లపై ముద్రగడ పద్మనాభం ప్రారంభించడానికి నాలుగు మాసాల ముందే కార్యక్రమాన్ని ప్రారంభిస్తానని జగన్ ను కోరితే తనకు అనుమతి ఇవ్వలేదని చెప్పారు. ఆ తర్వాత కూడ ఈ విషయమై అనుమతి కోరితే జగన్ అనుమతివ్వలేదన్నారు. 

2014 ఎన్నికల సమయంలో తాను విజయవాడ తూర్పు అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేశానని చెప్పారు. ఆ తర్వాత జగన్ ఆదేశాల మేరకే తాను విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ సెగ్మెంట్ కు మారాల్సి వచ్చిందని చెప్పారు. ఈ నియోజకవర్గంలో తాను పని చేసుకొంటూ వెళ్తున్న సమయంలో తనకు తెలియకుండానే మరో వ్యక్తిని పార్టీలోకి తీసుకొన్నారని రాధా చెప్పారు.

ఈ విషయమై తాను జగన్ ను ప్రశ్నిస్తే తన మంచి కోసమే మల్లాది విష్ణును పార్టీలోకి తీసుకొన్నట్టుగా చెప్పారన్నారు.  తన మంచి కోసమే పనిచేస్తున్నానని పైకి చెబుతూ తనకు వెన్నుపోటు పొడిచారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

క్యాష్, క్యాస్ట్ జగన్‌కు అవసరమన్నారు. వైసీపీలో తనకు అనేక అవమానాలు జరిగాయని వంగవీటి రాధా చెప్పారు. పార్టీలో తాను పడిన అవమానాలను రాష్ట్రంలో పర్యటించి ప్రజలకు వివరిస్తానని చెప్పారు.

వచ్చేది వేసవి కాలం, ఫ్యాన్లు ఆపేసుకొని ఏసీ వేసుకోవాలని ప్రజలను కోరుతానని పరోక్షంగా వైసీపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తానని రాధా చెప్పారు. రంగా విగ్రహావిష్కరణ సమయంలో తన ఒక్కడి ఫోటో మాత్రమే ఉండాలని జగన్ చెప్పినట్టుగా రాధా గుర్తు చేసుకొన్నారు. ఈ ఆంక్షలు ఎందుకు విధిస్తున్నారని ఆయన ప్రశ్నించారు.

రంగా హత్య ఎవరి పనో ప్రజలకు తెలుసునని రాధా చెప్పారు.వైసీపీకి తాను రాజీనామా చేసిన సమయంలో తనను టీడీపీలో చేరాలని ఆ పార్టీ నేతలు ఆహ్వానించడంలో తప్పేమీ లేదన్నారు. తన తండ్రి ఫోటోను ఒక్క పార్టీ వాళ్లే వాడుకోవాలని లేదన్నారు. పార్టీలకు అతీతంగా నాన్న పనిచేశారని ఆయన చెప్పారు.

రంగా హత్యకు టీడీపీకి సంబంధం లేదని తాను చెప్పడం ఆ పార్టీని ప్రసన్నం చేసుకొనేందుకేనని చెప్పడంలో అర్ధం లేదన్నారు.వైసీపీలో కూడ నా మాదిరిగానే చాలా మంది సీనియర్లు ఇదే తరహాలోనే అవమానాలను ఎదుర్కొంటున్నారని చెప్పారు. అయితే తాను మాత్రమే బయట మాట్లాడుతున్నానని ....సీనియర్ నేతలు మాత్రం ఈ విషయాలపై నోరు మెదపడం లేదన్నారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios