విజయవాడలో వైసిపి నేత వంగవీటి రాధాకృష్ణ రాజకీయంగా గందరగోళంలో ఉన్నారా? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. చాలా కాలంగా రాధా పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనటం లేదు. పార్టీ పరంగా విజయవాడ నగరంలో జరుగుతున్న మార్పులు, చేర్పుల వల్లే రాధాలో గందరగోళం మొదలైనట్లు సమాచారం. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుండి మూడుసార్లు పోటీ చేసినా ఒక్కసారి మాత్రమే గెలిచారు. అవటానికి వంగవీటి రంగా వారసుడే అయినప్పటికీ అంతటి సామర్ధ్యం అయితే రాధాలో లేదనే చెప్పాలి.

ఇక, ప్రస్తుతానికి వస్తే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం మాజీ ఎంఎల్ఏ మల్లాది విష్ణు ఎప్పుడైతే వైసిపిలో చేరారో అప్పటి నుండే రాధాలో డిస్ట్రబెన్స్ మొదలైంది. వచ్చే ఎన్నికల్లో సెంట్రల్ నియోజకవర్గంలో తనకు టిక్కెట్టు ఇస్తారో ఇవ్వరో అన్న ఆందోళన రాధాలో మొదలైనట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దానికితోడు తండ్రి లాగ రాధా తిరుగులేని నాయకుడేమీ కాదు. అందుకనే రాధా రాజకీయ జీవితం ఆటుపోట్లతోనే సాగుతోంది.

ఉండటానికి రాధా వైసిపిలోనే ఉన్నా టిడిపి నేతలతో కూడా బాగా సన్నిహిత సంబంధాలు మైన్ టైన్ చేస్తున్నారట. వైసిపిలో టిక్కెట్టుపై అభద్రతను టిడిపిలోని తన సన్నిహితుల వద్ద ప్రస్తావించినట్లు సమాచారం. దాంతో టిడిపి నేతలు అదే విషయాన్ని చంద్రబాబు వద్ద ప్రస్తావించారట. అసలే కాపు ఉద్యమం వల్ల ఇబ్బందుల్లో ఉన్న చంద్రబాబు వెంటనే రాధాను టిడిపిలోకి తీసుకొచ్చే విషయంపై సానుకూలంగా స్పందించారట.  

ఒకవైపు టిక్కెట్టుపై వైసిపిలో అభద్రత. ఇంకోవైపు టిడిపి నుండి ఆఫర్. జనసేన విషయంలో లేని క్లారిటీ. ఇటువంటి విషయంలో ఏమి చేయాలో అర్ధంకాక రాధాలో గందరగోళం మొదలైనట్లు సమాచారం. సెంట్రల్ నియోజకవర్గంలో కాకపోతే విజయవాడలో మరో నియోజకవర్గం కావచ్చు లేదా జిల్లాలో ఎక్కడైనా కావచ్చు రాధాకు టిక్కెట్టు విషయంలో జగన్ పరంగా ఇబ్బందులు లేదని కూడా వైసిపి వర్గాలంటున్నాయి. కాకపోతే రాధానే సెంట్రల్ నియోజకవర్గం విషయంలో పట్టుదలగా ఉన్నారట. ఎన్నికలు ముంచుకువస్తున్న సమయంలో రాధాలో మొదలైన గందరగోళం ఏ విధంగా ముగుస్తుందో చూడాలి.