గుంటూరు: మాస్క్ లు లేవని ప్రశ్నించిన దళిత డాక్టర్ సుధాకర్ విషయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఏవిధంగా అమానుషంగా వ్యవహరించారో... చిత్తూరు జిల్లా పెనుమూరు ప్రభుత్వ వైద్యశాలలో అవినీతిని ప్రశ్నించినందుకు దళిత మహిళా డాక్టర్ అనితారాణి పట్ల కూడా అదేవిధంగా వ్యవహరిస్తున్నారని టిడిపి మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆరోపించారు. 

''అమెరికాలో కోట్లు సంపాదించి పెట్టే ఉద్యోగాన్ని వదులుకుని గ్రామీణ ప్రాంత పేదలకు వైద్యం అందించాలని తపించడమే అనితారాణి చేసిన నేరమా?  రెండు నెలల క్రితం కింది స్థాయి ఉద్యోగులు అవినీతిని ప్రశ్నించడమే ఆమె చేసిన తప్పా? మాస్క్ లు లేవని ప్రశ్నించిన దళిత డాక్టర్ సుధాకర్ మెడరెక్కలు విరిచి, లాఠీలతో ఇష్టారాజ్యంగా కొట్టి, పిచ్చివాడిని చేసి ఆసుపత్రి పాలుచేశారు. ఇప్పుడు అనితారాణిపైనా కక్షసాధింపు చర్యలకు జగన్మోహన్ రెడ్డి పాల్పడుతున్నారు'' అని అన్నారు. 

''అనితారాణిపై వేధింపులకు పాల్పడిన వైసీపీ నేతలపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? రెండు నెలల క్రితమే ఆమెను వైసీపీ నేతలు తీవ్ర దుర్భాషలాడుతూ.. అభ్యంతరకరంగా ప్రవర్తిస్తే... చర్యలు శూన్యం. పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకున్న పాపాన పోలేదు. పైగా వైసీపీ నేతలతో బెదిరింపులకు పాల్పడ్డారు. అసలు రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఉందా? మహిళా కమిషన్ ఉన్నా న్యాయం జరిగే పరిస్థితి లేదు'' అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 

read more   జగన్ ఏడాది పాలనపై ‘‘విధ్వంసానికి ఒక్క ఛాన్స్’’ అంటూ టీడీపీ ఛార్జీషీట్

''డాక్టర్ సుధాకర్ వ్యవహారంలో హైకోర్టు స్పందించినట్లుగానే అనితారాణి విషయంలో కూడా న్యాయస్థానాలు జోక్యం చేసుకునే పరిస్థితి తలెత్తడానికి జగన్ విధానాలనే కారణం.  అనితారాణికి జరిగిన అన్యాయంపై ప్రశ్నించిన నారా లోకేష్ గారిపై  రోజా ఎదురుదాడి చేస్తున్నారు. చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకే ఈ ఆరాటం. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు రోజా ఆరాటపడాలి కానీ.. తప్పుల్ని కప్పిపుచ్చుకునేందుకు కాదు. లోకేష్ గారి పేరు ఎత్తే అర్హత అసలు రోజాకు ఉందా?'' అంటూ  మండిపడ్డారు. 

''అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుల విషయంలో వైసీపీ అసలు రంగు బయటపడుతోంది. దళితులపై వేధింపులు పెరిగాయి. వారిని చిన్నచూపు చూస్తున్నారు.  దళితులపై కక్ష సాధించేందుకే జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చారా?  గోల్డ్ మెడల్ సాధించి డాక్టర్ అయిన దళిత మహిళ అనితారాణిపై వైసీపీ గూండాల దాష్టీకంపై సమగ్ర విచారణ జరిపించాలి. బూతులు తిడుతూ ఫోటోలు తీసిన వారిని కఠినంగా శిక్షించాలి. లేనిపక్షంలో దళితులే మీకు బుద్ధి చెబుతారు'' అని అనిత హెచ్చరించారు.