Asianet News TeluguAsianet News Telugu

మహిళలపై వాలంటీర్ల లైంగిక వేధింపులు..అయినా చర్యలేవి: జగన్ పై అనిత ఆగ్రహం

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిది ఆరంభశూరత్వమే కానీ వీరత్వం కాదని టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆరోపించారు.

Vangalapudi Anitha fires on CM YS Jagan over women safety
Author
Amaravathi, First Published Jun 4, 2020, 6:52 PM IST

విజయవాడ: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిది ఆరంభశూరత్వమే కానీ వీరత్వం కాదని టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆరోపించారు. నవరత్నాల పేరుతో ప్రజలను నిండా ముంచారని ఆమె మండిపడ్డారు. మహిళలను సొంత చెల్లెళ్లలా చూసుకుంటానని ఎన్నికల ప్రచారంలో మాయమాటలు చెప్పి  అధికారంలోకి వచ్చాక నట్టేట ముంచారన్నారు. అధికారంలోకి రావడానికి తల్లి, చెల్లిని ఉపయోగించుకున్న జగన్ ఇప్పుడు వాళ్లను ఎక్కడకు నెట్టారో చూస్తూనే ఉన్నామన్నారు. 

''ఏడాది పాలనలో ఏం సాధించారని వైసీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు? ఒక్క ఆడకూతురిని రక్షించిలేని ఈ ప్రభుత్వం ఉంటే ఏంటి? పోతే ఏంటి?  తమకు జరుగుతున్న అన్యాయంపై మహిళలు బయటకు వచ్చి చెబుతున్నా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందించడంలో వాలంటీర్ల వ్యవస్థ ఘోరంగా విఫలమైంది. వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగస్తులా లేక వైసీపీ ఉద్యోగస్తులా?'' అని ప్రశ్నించారు. 

''ప్రభుత్వ ఖజానా నుంచి వాలంటీర్లకు జీతాలు ఇవ్వడమే కాకుండా వారు చేస్తున్న ప్రతి చెడ్డ పనినీ వెనకేసుకొస్తున్నారు. టీడీపీ హయాంలో పైసా తీసుకోకుండా జన్మభూమి కమిటీలు ప్రజా సేవలో పాల్గొన్నాయి. నేడు వాలంటీర్ల అరాచకాలను చూసి జనం భయపడిపోతున్నారు. ఎమ్మార్వోలను కూడా శాసించే స్థాయికి వాలంటీర్లు వెళ్లిపోయారు. రైతు భరోసా పేరిటి వాలంటీర్లు వసూళ్లు చేస్తున్నారు. నకిలీ మద్యం అమ్ముతూ పట్టుబడుతున్నారు'' అని ఆరోపించారు.  

read more   వైసీపీలో కలకలం: ఆనం రామనారాయణరెడ్డికి తోడైన మాజీ మంత్రి ధర్మాన

''వాలంటీర్ల వేధింపులు తట్టుకోలేక ఇటీవల ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. వీరి వేధింపులు  తట్టుకోలేక టీడీపీ నేత బండారు సత్యనారాయణ మూర్తి కారు డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. మరో వాలంటీర్ మైనర్ బాలికపై అత్యాచారం చేశాడు. దిశా చట్టం అని గొప్పలు చెప్పిన జగన్ ప్రభుత్వం ఏం చేస్తోంది? తెలంగాణ సీఎంకు సెల్యూట్ కొట్టడంలో బిజీగా ఉన్నారా? గన్ కంటే ముందుగా జగనన్న వస్తాడని జబర్దస్త్ డైలాగులతో ఆటో పంచ్ లు వేసిన మహిళలు ఏమైపోయారు? మహిళలపై అకృత్యాలు జరుగుతుంటే మీ నోర్లు ఎందుకు పెగలడం లేదు? మీరా ఆడవారిని ఉద్దరించేది? సిగ్గుందా మీకు?'' అంటూ విరుచుకుపడ్డారు. 

''దిశా చట్టం ఏ చెత్తబుట్టలోకి వెళ్లింది? ముఖ్యమంత్రి గారు కూడా ఆడపిల్ల తండ్రే కదా ఎందుకు స్పందించడం లేదు ? చిన్న పిల్లలపై వైసీపీ వాలంటీర్లు అఘాయిత్యాలకు పాల్పడుతుంటే ముఖ్యమంత్రి చేతులు కట్టుకుని కూర్చున్నారు. పేరుకే మహిళా హోంమంత్రి...ఆవిడ ఎప్పుడు మాట్లాడతారా అని ఎదురుచూడాల్సిన పరిస్థితి. మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు...జగన్ భజనతో కాలం గడుపుతున్నారు'' అంటూ విమర్శించారు. 

''ఏపీ మహిళా కమిషన్ ఏం చేస్తోంది? టీడీపీ హయాంలో అంతా సవ్యంగా ఉన్నా నోటి కొచ్చినట్టు మాట్లాడిన ఈ మహిళా కమిషన్ చైర్ పర్సన్ ఇప్పుడు  నోరెందుకు మెదపడం లేదు? వైసీపీ ఏడాది పాలనలో ఏపీలో 400కు పైగా అత్యాచారాలు జరిగాయి. ఒక్క నిందుడికైనా శిక్ష వేశారా? సిగ్గుంటే మహిళా కమిషన్ చైర్ పర్సన్ తన పదవికి రాజీనామా చేయాలి'' అని డిమాండ్ చేశారు. 

''ప్రభుత్వం తీరును ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెడితే కేసులు నమోదు చేస్తున్న జగన్ ప్రభుత్వం మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న వాలంటీర్లపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? మహిళ కన్నీరు జగన్ ప్రభుత్వానికి శాపంగా మారుతుంది. తప్పులు చేసిన వాలంటీర్లపై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదు. రంగుల విషయంలో, సుధాకర్ విషయంలో ఎంతవరకైనా వెళుతున్న ఈ ప్రభుత్వం దిశా అమలులో ఎందుకు చొరవ చూపించడం లేదు'' అని ప్రశ్నించారు. 

''చట్టరూపం దాల్చని దిశా కోసం పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేశారు. దానికి ముఖ్యమంత్రి గారు ఆర్భాటంగా శంకుస్థాపన చేశారు. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు...మేము ఏమైనా చేస్తామని ఎస్ఈసీనే పక్కకు తప్పించిన ఘనులు మీరు. అలాంటిది ఆడపిల్లపై అత్యాచారం చేసిన వాడిని శిక్షించలేరా? జగన్మోహన్ రెడ్డి పాలనలో కేవలం వైసీపీ మహిళలకు మాత్రమే న్యాయం జరిగింది. దిశా బిల్లుకు చట్టబద్ధత కల్పించే చిత్తశుద్ధి ఉందో లేదో ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడిన వాలంటీర్లను తొలగించాలి. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతమైతే తెలుగు మహిళ సత్తా ఏంటో ఈ ప్రభుత్వానికి చూపిస్తాం'' అని వంగలపూడి అనిత
 హెచ్చరించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios