అమరావతి:అధికారుల తీరుపై  అధికార పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు వరుసగా ఆరోపణలు చేయడం వైసీపీలో కలకలం రేపుతోంది. నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావులు అధికారుల తీరుపై మండిపడ్డారు. 

రెండో రోజున ఆనం రామనారాయణరెడ్డి అధికారుల తీరుపై మరోసారి నిప్పులు గక్కారు. మూడు రోజుల్లో సమగ్ర సమాచారంతో మీడియా సమావేశం ఏర్పాటు చేస్తానని ప్రకటించి సంచలనం సృష్టించారు.

రెండో రోజున కూడ మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అధికారులపై విమర్శలు గుప్పించారు. వెంకటగిరి నియోజకవర్గాన్ని అధికారులు పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. తన నియోజకవర్గం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందన్నారు. జిల్లాలో నీటి లెక్కలు తప్పుల తడకగా ఉన్నాయన్నారు. 

సోమశిల, స్వర్ణముఖి కెనాల్ పరిశీలించాలని సీఎం చెప్పినా పట్టించుకోలేదని ఆయన చెప్పారు. తాను ఏ విషయమై సమాచారం అడిగినా కూడ అధికారులు సరైన సమాచారం ఇవ్వడం లేదని ఆయన మండిపడ్డారు. మూడు రోజుల్లో పూర్తి సమాచారంతో మీడియా సమావేశం ఏర్పాటు చేస్తానని ఆయన ప్రకటించారు.  40 ఏళ్లలో ఈ తరహా అధికారులను ఏనాడూ చూడలేదన్నారు.

ఆనం రామనారాయణ రెడ్డి వ్యాఖ్యల కలకలం సాగుతున్న తరుణంలోనే మరో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఇవాళ ఏపీ డిప్యూటీ సీఎం ఆళ్లనాని సమక్షంలోనే అధికారుల తీరుపై మండిపడ్డారు.

శ్రీకాకుళం జిల్లాలో జరిగిన జీజీహెచ్ అభివృద్ధి సమీక్షా సమావేశంలో అధికారుల తీరును ధర్మాన ప్రసాదరావు ఎండగట్టారు. ఆసుపత్రుల్లో శానిటేషన్ ఉద్యోగం కోసం డబ్బులు ఎందుకు ఇవ్వాలని ఆయన ప్రశ్నించారు. 

also read:నీళ్లు అమ్ముకొంటున్నారు, జగన్ ఆదేశాలు పట్టించుకోవడం లేదు: ఆనం ఫైర్

సెంట్రలైజేషన్ డబ్బులు వసూలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అసలు శానిటేషన్ కాంట్రాక్టు ఎవరిదని ఆయన ప్రశ్నించారు.ముంబైకి చెందిన వ్యక్తికి శానిటేషన్ కాంట్రాక్టును ఎందుకు కట్టబెట్టారని ఆయన ప్రశ్నించారు.  

ఇద్దరు మాజీ మంత్రులు అధికారుల తీరుపై మండిపడడం ప్రస్తుతం కలకలం రేపుతోంది. వరుసగా ఇద్దరు సీనియర్లు అధికారుల తీరుపై మండిపడడం చర్చకు దారితీసింది. ఈ వ్యాఖ్యల వెనుక వేరే కారణాలున్నాయా... లేక అధికారుల తీరుతో విసిగి మాజీ మంత్రులు విమర్శలు చేశారా అనే విషయమై చర్చ సాగుతోంది.

మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి గతంలో కూడ ఇదే తరహాలో సంచలన ఆరోపణలు చేశారు. గత ఏడాది డిసెంబర్ 6వ తేదీన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. నెల్లూరు పట్టణంలో మాఫియాలకు అడ్డాగా మారిందని ఆయన ఆరోపించారు. ల్యాండ్, ఇసుక, బెట్టింగ్, లిక్కర్, కబ్జాకోరుల ఆగడాలకు అడ్డాగా మారిందన్నారు.

ఈ వ్యాఖ్యలను వైసీపీ అధిష్టానం సీరియస్ గా తీసుకొంది.ఈ వ్యాఖ్యలు చేసిన ఆనం రామనారాయణరెడ్డికి ఆ సమయంలో షోకాజ్ నోటీసు ఇచ్చింది.పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని ఆ సమయంలోనే ఎంపీ విజయసాయి రెడ్డి హెచ్చరించారు.గత ఏడాది డిసెంబర్ 12వ తేదీన ఆనం రామనారాయణరెడ్డి సీఎం జగన్ తో సమావేశమై  వివరణ ఇచ్చారు. దీంతో ఈ వివాదానికి తాత్కాలికంగా పుల్‌స్టాప్ పడింది.