గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కీలక వ్యాఖ్యలు చేశారు. విజయవాడ ఎంపీగా తాను పోటీ చేస్తానన్న వార్తలను ఆయన ఖండించారు.
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కీలక వ్యాఖ్యలు చేశారు. విజయవాడ ఎంపీగా తాను పోటీ చేస్తానన్న వార్తలను ఆయన ఖండించారు. 2024 ఎన్నికల్లో గన్నవరం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తానని స్పష్టం చేశారు. ఎవరికైనా సందేహం ఉంటే.. వైసీపీ అధిష్టానంతో మాట్లాడుకుంటే సరిపోతుందన్నారు. తాను టీడీపీలో ఉన్నప్పుడు కూడా మూడు, నాలుగు గ్రూపులు ఉండేవని చెప్పారు. ఓ న్యూస్ చానల్‌తో మాట్లాడుతూ వంశీ ఈ కామెంట్స్ చేశారు.
అమరావతి పేరుతో రైతులు పాదయాత్ర చేస్తే ఎవరికి అభ్యంతరం ఉండదని అన్నారు. కానీ రైతుల పాదయాత్రలో పెట్టుబడిదారులున్నారని ఆరోపించారు. జూనియర్ ఎన్టీఆర్‌ను టీడీపీ వాడుకుని వదిలేసిందని ఆరోపించారు. ఇప్పుడు.. చంద్రబాబు పవన్ కల్యాణ్ తోక పట్టుకుని ఈదాలని అనుకుంటున్నారని విమర్శించారు. చంద్రబాబుకు వేరే పని ఏముందని ఎద్దేవా చేశారు.
ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి వాక్ స్వాతంత్య్రం ఉందని.. అలాగని ఏదిపడితే అది చేస్తే మంచిది కాదని అన్నారు. పవన్ కల్యాణ్ తన క్యాడర్‌ను అదుపులో పెట్టుకోవాలని సూచించారు. మంత్రులపై దాడి ఘటనను ఖండించారు. ఆరు శాతం ఓట్ బ్యాంక్ ఉన్న జనసేన ఇలా దాడి చేస్తే.. 50 శాతం ఓట్ బ్యాంక్ ఉన్న వైసీపీ దాడి చేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది అని ప్రశ్నించారు.
