వకీల్ సాబ్ వివాదం: హైకోర్టు తీర్పుపై జగన్ ప్రభుత్వం హౌస్ మోషన్ పిటిషన్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా టికెట్ ధరలు పెంచుకోవడానికి ఏపీ ప్రభుత్వం అనుమతించని వివాదం కోర్టుకు ఎక్కింది. మూడు రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకోవచ్చునని కోర్టు తీర్పు చెప్పింది.
అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాకు ఊరట కలిగిస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చింది. మూడు రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకోవచ్చునని హైకోర్టు తీర్పు చెప్పింది. టికెట్ ధరల పెంపును, బెనిఫిట్ షోలను వైఎస్ జగన్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనుమతించలేదు.
దాంతో వివాదం కోర్టుకు ఎక్కింది. మూడు రోజుల పాటు ధరలు పెంచుకోవచ్చునని హైకోర్టు తీర్పు చెప్పింది. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై వైఎస్ జగన్ ప్రభుత్వం హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసేందుకు సిద్ధపడింది. హైకోర్టు డివిజన్ బెంచీలో ప్రభుత్వం పిటిషన్ వేసే అవకాశం ఉంది. టికెట్ ధరలు పెంచుకోవడానికి అనుమతించాలని కోరుతూ సినిమా నిర్మాతలు, డిస్డ్రిబ్యూటర్లు కోర్టుకు ఎక్కారు.
పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా శుక్రవారం విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమా టికెట్ ధరలను పెంచుకోవడానికి, బెనిఫిట్ సినిమాలు వేయడానికి జగన్ ప్రభుత్వం అనుమతించలేదు. దీంతో ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో పవన్ కల్యాణ్ అభిమానులు పలు చోట్ల ఆందోళనలకు దిగారు. థియేటర్లపై దాడులు కూడా చేశారు.
వకీల్ సాబ్ సినిమా విషయంలో ప్రభుత్వ తీరును తప్పు పడుతూ బిజెపి నేతలు సునీల్ దియోధర్, సత్య తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ సినిమా విజయం సాధించిందని, తాము తిరుపతిలో విజయం సాధిస్తామని సునీల్ దియోధర్ అన్నారు. ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కూడా వకీల్ సాబ్ వివాదంలో పవన్ కల్యాణ్ కు మద్దతుగా నిలిచారు. తాము వ్యాపారాలు చేసుకోకూడదా అని ఆయన వ్యాఖ్యానించారు.