గుంటూరు: ఆంధ్రప్రదేశ్ వడ్డెర కార్పోరేషన్ చైర్ పర్సన్ దేవళ్ల రేవతి మరో వివాదంలో చిక్కుకున్నారు. టోల్ గేట్ సిబ్బందిపై దేవళ్ల రేవతి వీరంగం సృష్టించి వార్తల్లోకి ఎక్కిన విషయం తెలిసిందే. ఆమె మేనల్లుడు వడియారాజు గుంటూరు జిల్లాలోని దాచేపల్లి నర్సింగ్ హోంలో వీరంగం సృష్టించాడు. 

దాచేపల్లి నర్సింగ్ హోంలో సిబ్బందిపై రేవతి మేనల్లుడు చేయి చేసుకున్నాడు. వైద్యం చేయించుకున్న తర్వాత బిల్లు చెల్లించాలని అడిగినందుకు అతను సిబ్బందితో గొడవకు దిగాడు. వైద్య సిబ్బంది పట్ల దురుసుగా ప్రవర్తించాడు. 

బిల్లు ఇంత అయిందా అని విరుచుకుపడ్డాడు.తాను వడ్డెర కార్పోరేషన్ చైర్ పర్సన్ దేవళ్ల రేవతి మేనల్లుడిని అంటూ బెదిరించాడు. ఈ గొడవకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఆస్పత్రి వర్గాలు అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాయి. 

టోల్ గేట్ వివాదంలో దేవళ్ల రేవతిపై మంగళగిరి పోలీసు స్టేషన్ లో కేసు నమోదైంది. టోల్ గేట్ సిబ్బందిపై ఆమె చేయి చేసుకున్నారు. బారికేడ్లను బలవంతంగా తొలగించి వెళ్లారు.