అమ్మవారు కనిపించారని, గుళ్లో గజ్జెల శబ్ధం వినిపిస్తోందని.. ఎర్రగా ఉన్న మహిళ జుట్టు విరబోసుకుని సంచరిస్తోందని.. మనం చిన్నప్పుడు అమ్మమ్మ దగ్గరో.. నానమ్మ దగ్గరో కథలు వింటూ ఉంటాం. ఇప్పుడు అచ్చం అలాంటి సంఘటనే ఒకటి నెల్లూరు జిల్లాలో సంచలనం కలిగిస్తోంది.

విజయదశమిని పురస్కరించుకుని ఆత్మకూరులో శరన్నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక జ్వాలాముఖి అమ్మవారి ఆలయంలో ప్రతిరోజు పూజలు నిర్వహించి రాత్రి తలుపులు మూసివేసేవారు.

అయితే ఆ రోజు అర్థరాత్రి వేళ ఓ మహిళ ఆలయ ప్రాంగణంలో ప్రదక్షిణలు చేస్తోందని.. గజ్జెల శబ్ధం వినిపిస్తోందని పుకార్లు వ్యాపించాయి. దుర్గాష్టమి రోజు రాత్రి నుంచి ఇలా జరుగుతుందని పలువురు కథలు కథలుగా చెప్పుకుంటూ ఉన్నారు.

భక్తులు మొదట వీటిని కొట్టిపారేసినా ఆలయ అర్చకుడు కూడా తనకు ఇలాంటి శబ్ధాలు వినిపించాయని చెప్పడంతో.. కొందరు యువకులు అర్థరాత్రి సమయంలో సెల్‌ఫోన్ కెమెరాల్లో ఆ దృశ్యాలను చిత్రీకరించారు.

పసుపురంగు వస్త్రాలు ధరించిన ఓ మహిళ ముఖం కనిపించకుండా ఆలయ ప్రాంగణంలో ప్రదక్షిణలు చేస్తున్న దృశ్యాలు పట్టణమంతా వ్యాపించాయి.. అయితే కొందరు హేతువాదులు మాత్రం.. ఇదంతా కట్టుకథని.. ఎవరో కావాలని చేస్తోన్న పని అని చెబుతున్నారు. మరోవైపు ఈ విషయం ఆ నోటా ఈ నోటా తెలుసుకున్న జనాలు జ్వాలాముఖి ఆలయానికి పొటేత్తారు.