పార్లమెంట్‌లో కేశినేని నానికి ఎదురుపడ్డ నితిన్ గడ్కరీ.. చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకొస్తారంటూ వ్యాఖ్య
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పై కేంద్ర మంత్రి , బీజేపీ అగ్రనేత నితిన్ గడ్కరీ ఆరా తీశారు. పార్లమెంట్ ఆవరణలో టీడీపీ ఎంపీ కేశినేని నానిని కలిసిన ఆయన కడిగిన ముత్యంలాగా చంద్రబాబు బయటకు వస్తారని నితిన్ గడ్కరీ ధీమా వ్యక్తం చేశారు.

స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో వున్నారు. ఈ నేపథ్యంలో ఆయన అరెస్ట్‌ను నిరసిస్తూ ఏపీతో పాటు పలు ప్రాంతాల్లో ఆందోళనలు జరుగుతున్నాయి. సినీ, రాజకీయాలతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు చంద్రబాబు అరెస్ట్‌ను ఖండిస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ అగ్రనేత, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చంద్రబాబు అరెస్ట్ విషయంపై వాకబు చేశారు.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల సందర్భంగా టీడీపీ ఎంపీ కేశినేని నానికి ఎదురైన గడ్కరీ చంద్రబాబు గురించి ఆరా తీశారట. ఈ విషయాన్ని కేశినేని నాని ట్వీట్టర్ ద్వారా తెలిపారు. చంద్రబాబు మచ్చలేని ప్రజాసేవకుడుని.. ఆయనో గొప్పనేత , ఎటువంటి తప్పు చేసే వ్యక్తికాదని గడ్కరి అన్నారు. చంద్రబాబు గొప్పతనం ప్రపంచ ప్రజలందరికీ తెలుసునని ఆయన పేర్కొన్నారు. భగవంతుని ఆశీస్సులతో ఆయనకు అన్ని విఘ్నాలు తొలగిపోతాయని, కడిగిన ముత్యంలాగా చంద్రబాబు బయటకు వస్తారని నితిన్ గడ్కరీ ధీమా వ్యక్తం చేశారు.