ఆంధ్రప్రదేశ్‌లో రానున్న ఎన్నికల్లో పొత్తులకు సంబంధించి కేంద్ర సామాజిక, న్యాయ సాధికార శాఖ సహాయ మంత్రి నారాయణస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో రానున్న ఎన్నికల్లో పొత్తులకు సంబంధించి కేంద్ర సామాజిక, న్యాయ సాధికార శాఖ సహాయ మంత్రి నారాయణస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. రానున్న ఎన్నికల్లో బీజేపీకి టీడీపీ మద్దతు ఉంటుందని ఆశిస్తున్నామని చెప్పారు. బెంగళూరు నుంచి రోడ్డు మార్గం ద్వారా పావగడ వెళ్తున్న ఆయన మార్గమధ్యంలో మడకశిర పట్టణంలో ఆగారు. అక్కడ రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన నారాయణస్వామి.. ఒకప్పుడు ఎన్డీయేలో బీజేపీతో ఏ పార్టీలు ఉన్నాయో.. 2024 ఎన్నికల్లో వాటన్నింటిని కలుపుకుని వెళ్లనున్నట్టుగా తెలిపారు. 

అందులో భాగంగానే ఏపీలో టీడీపీ మద్దతు కొనసాగిస్తుందనే విశ్వాసం వ్యక్తం చేశారు. ఏపీలో బీజేపీకి మంచి వాతావరణం ఉందని అన్నారు. ఏపీ ఎన్డీయే పక్షాలతో పోటీ చేయనున్నట్టుగా తెలిపారు. ఏపీలో పార్టీ బలోపేతం కోసమే పురందేశ్వరిని అధ్యక్షురాలిగా నియమించినట్టుగా చెప్పారు. 

ప్రస్తుతం ఏపీలో వైసీపీ అధికారంలో ఉండగా.. టీడీపీ, జనసేనలు ప్రతిపక్షాలుగా ప్రభుత్వ తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. వైసీపీ అంటనే విరుచుకుపడుతున్న జనసేన.. ప్రస్తుతం ఏపీలో పొత్తులో ఉంది. అయితే ఆ పొత్తుకు పేరుకు మాత్రమే అనే విశ్లేషణలు ఉన్నాయి. బీజేపీ రాష్ట్ర నాయకత్వంకు, పవన్‌ కల్యాణ్‌ల మధ్య సత్సబంధాలు లేవనే సంగతి తెలిసిందే. వైసీపీని గద్దె దించాలనే లక్ష్యంతో ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్.. వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వనని పలుమార్లు స్పష్టం చేశారు. అంతేకాకుండా.. టీడీపీతో పొత్తుకు కూడా సిద్దమవుతున్నారనే ప్రచారం సాగింది. 

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా బీజేపీతో కలిసే ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నారనే ప్రచారం ఉంది. అలాగైతేనే వైసీపీ అధికార దుర్వినియోగాన్ని కంట్రోల్ చేయవచ్చని ఆలోచనలో ఆయన ఉన్నారు. ఈ క్రమంలోనే ఇటీవల ఢిల్లీలో అమిత్ షా, జేపీ నడ్డాలతో చంద్రబాబు సమావేశం కావడంతో పొత్తుకు సంబంధించి ఊహాగానాలు వెలువడ్డాయి. ఇక, ఇటీవల పవన్ కల్యాణ్ పొత్తులపై బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. సమగ్ర అధ్యయనం తర్వాతే పొత్తులపై నిర్ణయం ఉంటుందని వెల్లడించారు.