ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ అప్పుల పాలైపోయిందని.. ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం కూడా కష్టమైపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. 

ఏపీలోని వైఎస్ జగన్ సర్కార్‌పై (ys jagan govt) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు బీజేపీ నేత (bjp) , కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (kishan reddy). బీజేపీ ఆధ్వర్యంలో శనివారం కడపలో (kadapa) నిర్వహించిన రాయలసీమ రణభేరి (rayalaseema ranabheri) సభలో కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీ (ysrcp) పాలనలో రాష్ట్రం అప్పుల ఆంధ్రప్రదేశ్‌గా మారిందని ఎద్దేవా చేశారు. రతనాల సీమ వెనుకబడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాయలసీమ నుంచి ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చినప్పటికీ సీమలో అభివృద్ధి మాత్రం జరగలేదని కిషన్ రెడ్డి దుయ్యబట్టారు. సాగునీటి ప్రాజక్టులపై నిర్లక్ష్యమే ఈ ప్రాంతం వెనుబాటుకు కారణమని ఆయన అభిప్రాయపడ్డారు.

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాయలసీమలో అనేక సంస్థలు నిర్మించిందని కిషన్ రెడ్డి గుర్తుచేశారు. కడప, తిరుపతి, అనంతపురంలో అనేక ప్రాజెక్టులు వచ్చాయని.. పోలవరం ప్రాజెక్టును (polavaram project) పూర్తిగా కేంద్ర నిధులతో నిర్మిస్తున్నట్లు తెలిపారు. రాయలసీమ అభివృద్ధికి సీఎం జగన్‌ చేపట్టిన కార్యక్రమాలేంటి అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. సీమ అభివృద్ధికి మొట్టమొదట పోరాడింది బీజేపీయేనని... ఇందుకోసం తమ పార్టీ చిత్తశుద్ధితో పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు. 

ప్రధాని మోదీ (narendra modi) హయాంలో రాయలసీమ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని.. కేంద్రం అన్ని రకాలుగా అండగా నిలస్తోందని కిషన్ రెడ్డి వెల్లడించారు. ఈ ప్రాంతంలో రోడ్ల అభివృద్ధికి మా ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. వైసీపీ పాలన చూస్తే రానున్న రోజుల్లో ఏపీలో ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి వస్తుందని ఆయన జోస్యం చెప్పారు. అప్పులు ఇచ్చే వాళ్లు ఎంతకాలం ఇస్తారు? అప్పులపై ఆధారపడి ఎంతకాలం పాలిస్తారు? ప్రతి రైతుకు కేంద్రం ఏటా రూ.6వేలు ఇస్తోందని కిషన్ రెడ్డి అన్నారు. 

ఫ్యామిలీ పార్టీలు, కుటుంబ రాజకీయాలు పోవాలని.. ఏపీలో బీజేపీలో చేరేవారిపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తే అనేక ఇబ్బందులు పెడుతున్నారని... రాష్ట్రంలో లిక్కర్‌, ల్యాండ్‌ కాంట్రాక్టర్ల మాఫియా పెరిగిందని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి పెరిగిపోయిందని.. తాను ఏంతో మంది ముఖ్యమంత్రులను చూశానని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యంలో ఎంతటి నియంతలైనా పతనంకాక తప్పదని... ఏపీలో ఈ అవినీతి ప్రభుత్వం పోవాలని కిషన్ రెడ్డి ఆకాంక్షించారు. రానున్న రోజుల్లో బీజేపీని అధికారంలోకి తీసుకురావాల్సిన అవసరముందన్నారు. త్వరలో గండికోటను సందర్శించి పర్యాటకులు తరలివచ్చే విధంగా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తాం అని కిషన్‌రెడ్డి హామీ ఇచ్చారు.