న్యూఢిల్లీ: ఏపీ ఎస్ఈసీ రమేష్ కుమార్ రాసిన లేఖ కేంద్ర ప్రభుత్వానికి అందిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు.

శుక్రవారం నాడు ఆయన న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమారే ఆ లేఖ రాశారని తమ వద్ద సమాచారం ఉందని మంత్రి స్పష్టం చేశారు.కేంద్రం సూచనల  మేరకే రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం వద్ద సీఆర్‌ఫీఎఫ్ బలగాలతో భద్రతను ఏర్పాటు చేసినట్టుగా కిషన్ రెడ్డి  చెప్పారు.

ఏ ప్రభుత్వాధికారికైనా భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని  మంత్రి చెప్పారు.రాష్ట్ర పరిధిలోని అంశమైనా అవసరమైతే కేంద్రం జోక్యం చేసుకొంటుందన్నారు.

తన ప్రాణాలకు ముప్పు ఉందని రక్షణ కల్పించాలని కోరుతూ ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రమేష్ కుమార్ పేరుతో రెండు రోజుల క్రితం  రాసిన లేఖ రెండు రోజుల క్రితం మీడియాకు విడుదలైంది.

Also read:కేంద్రానికి లేఖపై ఏపీ ఈసి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ట్విస్ట్

తనకు రక్షణ కల్పించాలని ఆయన  ఆ లేఖలో కోరారు.  అయితే ఈ లేఖను తాను రాయలేదని ఎఎన్ఐ మీడియా సంస్థకు రమేష్ కుమార్ చెప్పినట్టుగా ఆ వార్తా సంస్థ గురువారం నాడు ప్రకటించింది.

ఈ లేఖ విషయమై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి శుక్రవారం నాడు కుండబద్దలు కొట్టారు. ఈ లేఖ ఎవరు రాశారనే విషయమై చర్చ సాగుతున్న తరుణంలో కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ప్రాధాన్యతను సంతరించుకొన్నాయి.