న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సహకరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కోరారు.

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షేకావత్‌ సమావేశమయ్యారు. గోదావరి, పెన్నా నదులను కావేరితో అనుసంధానం చేయాలని  ఆయన కోరారు. ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ, తమిళనాడు ప్రాంతాల్లోని కరవు ప్రాంతాలకు సాగు, తాగు నీరు అందించేందుకు ఈ ప్రాజెక్టు ఎంతో కీలకమైందని వెంకయ్యనాయుడు గుర్తు చేశారు.

ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం ఇప్పటికే ఏపీ రాష్ట్రం 3 వేల కోట్లను కేటాయించిన విషయాన్నిఉపరాష్ట్రపతి కేంద్ర మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. నిధులు లేని కారణంగా పోలవరం ప్రాజెక్టు ఆలస్యం కాకుండా ఉండాలనేది తన అభిమతంగా ఆయన పేర్కొన్నారు.

ఈ ప్రాజెక్టుకు అవసరమైన నిధుల విడుదల కోసం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రితో చర్చించనున్నట్టు గజేంద్ర షెకావత్‌ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు చెప్పారు.