Asianet News TeluguAsianet News Telugu

తిరుమల వెంకన్న సాక్షిగా చెబుతున్నా ... జగన్ వదిలిపెట్టే ప్రసక్తేలేదు : బండి సంజయ్ వార్నింగ్

తిరుమల వెంకటేశ్వరస్వామితో పెట్టుకున్న ఎవరూ బాగుపడినట్లు చరిత్రలోనే లేదు... ఇలా వైసిపి నాయకులు కూడా స్వామివారి ఆగ్రహానికి గురికావాల్సి వచ్చిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. స్వామివారి ఆస్తులు దోచుకున్న ఏ దొంగను వదిలిపెట్టే ప్రసక్తేలేదని హెచ్చరించారు. 

 Union Minister Bandi Sanjay Warning to YS Jagan in Tirumala AKP
Author
First Published Jul 11, 2024, 4:39 PM IST

తిరుపతి : ఆంధ్ర ప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు వైసిపి నాయకులపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మొన్నటివరకు నిలువు నామాలు పెట్టుకుని తిరుమలలో కనిపించిన వారు ప్రజలకు పంగనామాలు పెట్టారని ఆరోపించారు. గత పాలకులు తిరుమల శ్రీవారి పేరుతో దందాలు చేసారని... స్వామివారి ఆస్తులను దోచుకున్నారని ఆరోపించారు. పాలకుల ముసుగులో ప్రజాధనాన్నే కాదు శ్రీవారి సొత్తును దోచుకున్న దొంగలను వదిలే ప్రసక్తే లేదంటూ గత వైసిపి పాలకులను హెచ్చరించారు. 

కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ పుట్టినరోజు సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబసమేతంగా ఏడుకొండలపైకి చేరుకున్న కేంద్ర మంత్రికి టిటిడి అధికారులు స్వాగతంపలికి దర్శన ఏర్పాట్లు చేసారు. వెంకటేశ్వర స్వామి దర్శనం అనంతరం అర్చకులు తీర్థప్రసాదాలు అందించి వేదాశీర్వచనం అందించారు. కోరిన కోర్కెలు తీర్చే తిరుమల వెంకన్నను రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖసంతోషాలతో వుండాలని కోరుకున్నట్లు సంజయ్ తెలిపారు. భారత్ ను విశ్వగురు స్థానంలో నిలిపేందుకు కృషిచేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి స్వామివారి ఆశిస్సులు వుండాలని కోరుకున్నట్లు కేంద్ర మంత్రి పేర్కొన్నారు. 

 

దైవదర్శనం అనంతరం తిరుమలలో ప్రస్తుత ఏర్పాట్లను పరిశీలించిన కేంద్ర మంత్రి సంజయ్ సంతృప్తి వ్యక్తం చేసారు. ప్రస్తుతం శ్రీవారి సన్నిధి తిరుమలలో భక్తియుత, ధార్మిక వాతావరణం కనిపిస్తోంది... గత ఐదేళ్లు ఇక్కడ ఇలాంటి పరిస్థితి లేదన్నారు. దేవుడంటే విశ్వాసం లేనివారు... హిందూ ధర్మం గురించి తెలియనివారు సైతం తిరుమలలో పెత్తనం చేసేవారని... నిలువునామాలు పెట్టుకుని స్వామివారి ఆస్తులకు పంగనామాలు పెట్టారంటూ మండిపడ్డారు. 

స్వామివారి సన్నిధిలో రాజకీయాలు చేసేవారని...  రాజకీయ నిరుద్యోగుల పునరావాస కేంద్రంగా టిటిడి మార్చారని అన్నారు. అన్యమతస్తులకు పదవులిచ్చి హిందూ ధర్మంపై దాడి చేసారని అన్నారు. పదవుల కోసం టిటిడిని వాడుకున్న నయవంచకుల  పాలన పోయింది... నిత్యం వెంటేశ్వర స్వామి నామస్మరణ చేసే సేవకుల రాజ్యం వచ్చిందంటూ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేసారు. 

ఇదిలావంటే శ్రీవారు వెలిసిన శేషాచలం కొండల్లో ఎక్కడా దొరకని ప్రకృతి సంపద దాగివుంది... దీన్ని గత పాలకులు నాశనం చేసారని కేంద్ర మంత్రి ఆరోపించారు. ఎర్రచందనం చెట్లను అక్రమంగా కొట్టేసి ఇతర దేశాలకు స్మగ్లింగ్ చేసారని... ఇలా వేలకోట్లు సంపాదించారని అన్నారు. ఈ ఎర్రచందనం స్మగ్లర్లు సర్కారుకే అప్పులిచ్చే స్థాయికి ఎదిగారంటే ఏ స్థాయిలో దోపిడీ సాగిందో అర్ధం చేసుకోవచ్చని అన్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ ద్వారా జాతీయ సంపదను దోచుకున్న వీరప్పన్ వారసుల సంగతి తేలుస్తామని బండి సంజయ్ హెచ్చరించారు. 

ఇప్పటికే తిరుమల శ్రీవారి సన్నిధిలో గత ఐదేళ్లు జరిగిన అక్రమాలతో పాటు ఎర్రచందనం స్మగ్లింగ్ పై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బిజెపి నేతలు మాట్లాడారని కేంద్ర మంత్రి సంజయ్ తెలిపారు. ఎర్రచందనం, శ్రీవారి ఆస్తుల దోపిడీపై నివేదిక కోరతామని... దాని ఆధారంగా దోపిడీదారులపై చర్యలుంటాయని హెచ్చరించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దృష్టికి ఈ వ్యవహారాన్ని తీసుకెళతానని అన్నారు. రాజకీయ ఒత్తిళ్లకు భయపడబోమని... శ్రీవారి సంపదను కాపాడే విధంగా తగిన చర్యలు తీసుకుంటామని సంజయ్ తెలిపారు. 

గత పాలకులు తిరుమలలో లంగ దందాలు, లఫంగా పనులన్నీ చేసారని సంజయ్ మండిపడ్డారు. సొంత ఆస్తుల కోసం ఏడుకొండలవాడి ఆస్తులను కొల్లగొట్టారని అన్నారు. ఏడుకొండలవాడిని రెండుకొండలవాడిని చేసేందుకు ప్రయత్నించారని... కానీ చివరకు ఆ దేవుడి ఆగ్రహానికి గురయి అధికారాన్నే కోల్పోయారని అన్నారు. కలియుగ ప్రత్యక్షదైవం ఏడుకొండల వెంకటేశ్వరస్వామితో పెట్టుకుంటే ఎవరికైనా ఇదే గతి పడుతుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ హెచ్చరించారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios