Asianet News TeluguAsianet News Telugu

ఏపీ హైకోర్టును కర్నూలుకు మార్చే పూర్తి ప్రతిపాదన పెండింగ్‌లో లేదన్న కేంద్రం.. ఏం చెప్పిందంటే..

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తరలింపుకు సంబంధించి పార్లమెంట్ వేదికగా కేంద్రం సమాధానం చెప్పింది. తమ వద్ద ఏపీ హైకోర్టును అమరావతి నుంచి కర్నూలుకు మార్చే పూర్తి ప్రతిపాదన పెండింగ్‌లో లేదని వెల్లడించింది. 

Union Law Minister minister kiren rijiju on Andhra Pradesh High court shifting
Author
First Published Aug 4, 2022, 2:13 PM IST

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తరలింపుకు సంబంధించి పార్లమెంట్ వేదికగా కేంద్రం సమాధానం చెప్పింది. తమ వద్ద ఏపీ హైకోర్టును అమరావతి నుంచి కర్నూలుకు మార్చే పూర్తి ప్రతిపాదన పెండింగ్‌లో లేదని వెల్లడించింది. తెలుగుదేశం పార్టీ ఎంపీ కనకమేడల రవీంద్ర‌కుమార్ రాజ్యసభలో.. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు‌ ప్రిన్సిపల్ బెంచ్‌ను అమరావతి నుండి కర్నూలుకు మార్చేందుకు ప్రభుత్వానికి ఏదైనా అభ్యర్థన వచ్చిందా అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు. 

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రిన్సిపల్ బెంచ్ అమరావతి నుంచి కర్నూలుకు బదిలీ చేయాలని.. 2020 ఫిబ్రవరిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రతిపాదించారని చెప్పారు. 
హైకోర్టు ప్రిన్సిపల్ బెంచ్‌ బదిలీ సంబంధిత హైకోర్టుతో సంప్రదించి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తుందని పేర్కొన్నారు. హైకోర్టు నిర్వహణ ఖర్చు భరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపైనే ఉంటుందని చెప్పారు. 

‘‘హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కోర్టు రోజువారీ పరిపాలనను నిర్వహించే బాధ్యతను కలిగి ఉంటారు. ప్రస్తుత విషయంలో.. హైకోర్టును కర్నూలు బదిలీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రెండూ తమ అభిప్రాయాన్ని రూపొందించాలి. పూర్తి ప్రతిపాదనను భారత ప్రభుత్వానికి సమర్పించాలి. ప్రస్తుతానికి అయితే ప్రభుత్వం వద్ద పూర్తి ప్రతిపాదన పెండింగ్‌లో లేదు’’ అని కిరణ్ రిజిజు పేర్కొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios