Asianet News TeluguAsianet News Telugu

అమరావతే రాజధాని.. ఎయిమ్స్, హైవేలు ఎందుకిచ్చాం : కేంద్ర మంత్రి నారాయణ స్వామి వ్యాఖ్యలు

ఏపీ రాజధాని అమరావతిపై సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి నారాయణ స్వామి. ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు జిల్లాలతో పాటు అమరావతి అభివృద్ధి చెందాలన్నదే కేంద్రం ఆలోచన అని ఆయన అన్నారు. 

union home minister narayana swamy sensational comments on ap capital amaravathi
Author
First Published Sep 14, 2022, 6:16 PM IST | Last Updated Sep 14, 2022, 6:20 PM IST

అమరావతిని రాజధానిగా అందరూ గుర్తించాలన్నారు కేంద్ర మంత్రి నారాయణ స్వామి. అమరావతి రాజధాని కాబట్టే ఎయిమ్స్, జాతీయ రహదారులు ఇచ్చామన్నారు.  ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు జిల్లాలతో పాటు అమరావతి అభివృద్ధి చెందాలన్నదే కేంద్రం ఆలోచన అన్నారు నారాయణ స్వామి. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా అభివృద్ధి ఆగకూడదని.. రాజధానులు 3 కాకపోతే 4 పెట్టుకోండి కానీ ముందు అమరావతిని అభివృద్ది చేయాలని ఆయన కోరారు. 

మరోవైపు... ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు రేపటి (సెప్టెంబర్ 15) నుంచి ప్రారంభం కానున్నాయి. ఐదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. రేపు ఉదయం 9 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సమావేశాల తొలి రోజే ప్రభుత్వం మూడు రాజధానులపై శాసనసభలో స్వల్పకాలిక చర్చను పెట్టే అవకాశం ఉంది. అధికార వికేంద్రీకరణను ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తున్న ప్రభుత్వం.. ఆ దిశగా అసెంబ్లీ సమావేశాలను వినియోగించుకోవాలని చూస్తోంది. 

మూడు రాజధానులపై సభలో సీఎం జగన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ విధంగా మూడు రాజధానులతో ప్రయోజనాలు ఉన్నాయనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఆలోచనలో జగన్ ఉన్నారు. మరోవైపు ఈ సమావేశాల్లో ప్రభుత్వం.. అధికార వికేంద్రీకరణ, మూడు రాజధానులపై కొత్త బిల్లును ప్రవేశపెట్టనుందనే ప్రచారం జోరుగా సాగుతుంది. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి సమాచారం లేకపోయినప్పటికీ.. ప్రభుత్వం వైపు నుంచి అలాంటి సంకేతాలు వెలువడుతున్నాయి. 

Also REad:రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. తొలి రోజే మూడు రాజధానులపై చర్చ..?

రాజధాని స్థానాన్ని మార్చే శాసనాధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని ఈ ఏడాది మార్చిలో ఏపీ హైకోర్టు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అలాగే అమరావతిలో పెండింగ్‌లో ఉన్న అన్ని పనులను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ తర్వాత అసెంబ్లీ.. ఏపీసీఆర్‌డీఏ రద్దు చట్టం- 2020, ఏపీ వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి చట్టం- 2020 లను రద్దు చేసింది. 

అయితే జగన్ సర్కార్ మాత్రం మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది.  విశాఖపట్నం (పరిపాలన రాజధాని), అమరావతి (శాసన రాజధాని), కర్నూలు (న్యాయ రాజధాని)..  మూడు రాజధానులకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం జగన్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ముగింపు సందర్భంగా చెప్పారు. గత టీడీపీ ప్రభుత్వం రూ. 1.09 లక్షల కోట్ల భారీ వ్యయంతో 53,000 ఎకరాలను అభివృద్ధి చేయాలనే బృహత్తర ప్రణాళికను రూపొందించిందని.. అయితే ఈ ప్రక్రియ అంతా అవినీతి, బంధుప్రీతితో కూడుకున్నదని జగన్ ఆరోపించారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios