ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారిని నివారించేందుకు ఒక్కొక్కటిగా వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తున్నాయి. భారత్‌లో కూడా త్వరలోనే వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహలు చేస్తోంది.

ముందుగా ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ఉన్న డాక్టర్లు, ఆరోగ్య సిబ్బంది, పోలీస్ తదితరులకు టీకా అందించాలని భావిస్తోంది. దీనిలో భాగంగా దేశవ్యాప్తంగా 30 కోట్ల మందికి కోవిడ్ వ్యాక్సిన్ వేయాలని అంచనా వేసింది.

కరోనా టీకాను వేగంగా అందించాలంటే ప్రత్యేక కార్యాచరణ అవసరమని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ అన్నారు. కోవిడ్‌-19పై ఆదివారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌‌లో ఆయన ప్రసంగించారు.

కాగా, దేశంలో కరోనా కేసుల సంఖ్య కోటి మార్క్‌ దాటిన రోజునే ఈ సమావేశం జరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది. భారత్‌లో వైరస్‌ వ్యాప్తి 2 శాతానికి పడిపోయిందని.. మరణాల రేటు కూడా క్రమంగా తగ్గుముఖం పట్టిందని ఆయన తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే అత్యల్పంగా 1.45 శాతంగా ఉందని.. రికవరీ రేటు 95.46 శాతానికి చేరిందని హర్షవర్థన్ పేర్కొన్నారు. అక్టోబరు, నవంబరు నెలలో పండుగలు ఉన్నప్పటికీ సమగ్ర పరీక్షలు, మెరుగైన చికిత్సా విధానాల కారణంగా కొత్త కేసుల్లో పెరుగుదల తగ్గిందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు.

వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తప్పనిసరిగా మాస్క్ ధరించడం, సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం వంటి కోవిడ్‌ నిబంధనలను పాటించాలని హర్షవర్థన్ సూచించారు.