ప్రత్యేక హోదాపై తేల్చేసిన కేంద్రం: చంద్రబాబుకు పరీక్ష

First Published 4, Jul 2018, 2:53 PM IST
Union Government files affidavit in supreme court on Ap bifurcation act
Highlights

ఏపీకి ప్రత్యేక హోదా విషయమై కేంద్రం కుండబద్దలు కొట్టింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమని సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొంది. ఏపీ విభజన చట్టంలో ఉన్న హమీలను అము చేసినట్టు కేంద్రం ప్రకటించింది. కాంగ్రెస్ నేత పొంగులేటి దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది.


న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో  కేంద్రప్రభుత్వం మరో వివాదాస్పద అఫిడవిట్ దాఖలు చేసింది. ఏపీకి విభజన చట్టంలో  ఇచ్చిన హమీలను అమలు చేశామని  ఇక ఏం చేసేదీ లేదని కేంద్రం ఆ అఫిడవిట్‌లో స్పష్టం చేసింది.

తెలంగాణ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై కేంద్ర ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. కేంద్ర ఆర్ధిక శాఖ కొన్ని కీలకమైన  విషయాలను ప్రస్తావించింది. ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్రం అధికారికంగా సుప్రీంకోర్టుకు తేల్చి చెప్పింది.

రాజ్యసభలో  అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఇచ్చిన హమీలను అమలు చేయలేమని కేంద్రం కోర్టుకు తెలిపింది. అయితే ఈ అఫిడవిట్‌లో కేంద్ర ఆర్ధిక శాఖ రైల్వే జోన్‌ గురించి ప్రస్తావించలేదు.

దుగ్గరాజపట్నం పోర్టుకు కేంద్ర కేబినెట్ సూత్రప్రాయ అంగీకరించిందని చెప్పింది. అయితే సాధ్యాసాధ్యాలపై అధ్యయనం అంటూ కేంద్రం మెలిక పెట్టింది. ప్రత్యేక ప్యాకేజీ ఎంత వరకు అమలు చేశారన్న విషయాన్ని ఈ అఫిడవిట్ లో కేంద్రం వెల్లడించలేదు. 

ఈఏపీలపై స్పష్టంగా ప్రస్తావించలేదు. విభజన జరిగిన ఏడాది ఏపీ రెవెన్యూలోటు రూ. 4116 కోట్లు మాత్రమేనని ఇప్పటి వరకూ 3979 కోట్లు ఇచ్చామని కేంద్రం లెక్కలు చెప్పుకొచ్చింది. రాజధాని నిర్మాణానికి రూ.2500 కోట్లు ఇచ్చినట్టు చెప్పింది. యూసీలు ఇచ్చిన తరువాత మరో మూడేళ్లలో ఏడాదికి రూ. 330 కోట్ల చొప్పున వెయ్యి కోట్లు ఇస్తామని కేంద్రం సుప్రీం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొంది. 

loader