డిజైన్లు మార్చినా అదనపు నిధులివ్వలేం: పోలవరంపై కేంద్రం మెలిక
పోలవరంపై 2014 అంచనాలే భరిస్తామన్న కేంద్రం తేల్చి చెప్పింది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర షెకావత్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.
న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టు డిజైన్లు మార్చినా 2014 ఏప్రిల్ నాటి అంచనా వ్యయాన్నే భరిస్తామని కేంద్రం తేల్చి చెప్పింది.వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్ర షెకావత్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. హెడ్‌వర్క్స్, డిజైన్ల మార్పుతో పోలవరం ప్రాజెక్టు ఖర్చు రూ. 5,535 కోట్ల నుండి రూ.7,192 కోట్లకు పెరిగిందని ఏపీ ప్రభుత్వం తెలిపిందని ఆ లేఖలో పేర్కొన్నారు.
గోదావరి ట్రిబ్యునల్ నిబంధనలకు లోబడే ప్రాజెక్టు డిజైన్లు ఉండాలని మంత్రి సూచించారు. వాటిని సీడబ్ల్యూసీ మార్పులు చేసిందన్నారు. కాపర్ డ్యామ్ పునాది పనులు, స్పిల్ వే డయాప్రం వాల్ పనులు, చిప్పింగ్, స్పీల్ వే కాంక్రీట పనులు అదనంగా చేపట్టామని ఏపీ తెలిపిందని కేంద్రం వివరించింది.అయితే అదనంగా నిధులు కేటాయించబోమని కేంద్రం తేల్చి చెప్పింది. పోలవరం ప్రాజెక్టును నిర్ధీత కాల వ్యవధిలో పూర్తి చేసేందుకు ఏపీ ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది. ఇటీవలనే సీఎం జగన్ ప్రాజెక్టు వద్ద పనుల పురోగతిని సమీక్షించారు. పనుల్లో మరింత వేగం పెంచాలని ఆయన ఆదేశించారు.