నువ్వు అందంగా లేవు.. నీతో నేను కాపురం చేయలేను.. మీ పుట్టింటికి వెళ్లి అదనంగా కట్నం తీసుకురా... లేకుంటే  నేను ఇంకో పెళ్లి చేసుకుంటానంటూ.. భర్త రోజూ వేధించేవాడు. భర్త వేదింపులు తట్టుకోలేక.. పుట్టింటికి వెళ్లి అదనంగా డబ్బు తీసుకురాలేక.. ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. చనిపోవడానికి ముందు భర్త, అత్తపై ఆరు పేజీల సూసైడ్ నోట్ రాసి మరీ చచ్చిపోయింది. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లాలో  చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... మండపేట మండలం అర్తమూరుకు చెందిన లక్ష్మీకాంతం(35)కు, అనపర్తికి చెందిన సత్తి కృష్ణారెడ్డిలో సుమారు ఐదుసంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వివాహ సమయంలో కట్నం కింద 15 కుంచాల వ్యవసాయ భూమితోపాటు కొంత నగదు, బంగారు నగలు ఇచ్చారు. 
 
అయితే లక్ష్మీకాంతం అందంగా లేదని, కాపురం చేయాలంటే మరికొంత కట్నం కావాలంటూ భర్త, అత్త ఆమెను వేధింపులకు గురిచేయడం ప్రారంభించారు. దీంతో ఆమె భర్త, అత్తల వేధింపులే తన ఆత్మహత్యకు కారణమంటూ ఆరుపేజీల సూసైడ్‌ నోట్‌ రాసి చనిపోయింది. లక్ష్మీ కాంతం తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆమె రాసిన సూసైడ్ నోట్ ఆధారంగా.. పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.