ప్రస్తుతం ఎపీ శాసన మండలి చీఫ్ విప్ గా పనిచేస్తున్న ఉమ్మారెడ్డి ఈ తరంవారికి ఎక్కువగా తెలిసి ఉండకపోవచ్చు. గతంలో ఎన్టీఆర్ టిడిపికి, ఇప్పుడు వైఎస్ జగన్ వైఎస్సార్ సిపీకి అందించిన, అందిస్తున్న సేవలు గణనీయమైనవి.

సీనియర్ రాజకీయ నాయకుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఈ తరంవారికి ఎక్కువగా తెలిసి ఉండకపోవచ్చు. కానీ, తెర వెనక గతంలో ఆయన చేసి పని అత్యంత కీలకమైంది. ప్రస్తుతం ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కూడా కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దాదాపు అన్ని రంగాలపై విశేషమైన అవగాహన కలిగిన ఆయన పేపర్ వర్క్ చేయడంలో దిట్టగా పేరు గాంచారు. పార్టీ తీర్మానాల రూపకల్పనలో ఆయన గతంలో సీనియర్ ఎన్టీఆర్ నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీకి పనిచేశారు. ప్రస్తుతం వైఎస్ జగన్ కోసం పనిచేస్తున్నారు. టిడిపి మహానాడులో ఆయనదే కీలకమైన పాత్ర ఉంటూ వచ్చింది. ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ప్రముఖమైన బాధ్యతలను తెర వెనక ఉండి నిర్వహిస్తున్నారు. 

గతంలో ఎన్టీఆర్ కు సంబంధించిన టిడిపి మహానాడు కార్యక్రమాలను రూపొందించి, వేదిక మీది నుంచి పద్ధతి ప్రకారం నడిపించేవారు. ప్రస్తుతం వైఎస్పార్ కాంగ్రెస్ ప్లీనరీలో అదే పని చేస్తున్నారు. వక్తలను ఆహ్మానించే విషయంలో తనదైన ముద్ర వేశారు. అనవసరంగా పార్టీ నేతలను ప్రశంసించే తత్వం కూడా ఆయనది కాదు. మితంగా మాట్లాడి కార్యక్రమాలు సజావుగా సాగేలా చూస్తారు. 

ఇప్పుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చీఫ్ విప్ గా పనిచేస్తున్నారు. ఆయన మృదుస్వభావి. ఎవరిని కూడా నొప్పించని మనిషి. సాధు స్వభావిగా ఆయనను చెప్పుకోవచ్చు. కటువు మాటలు ఆయన నోట విని ఎరుగం. వివాదరహితుడు. పదవుల కోసం ఆయన తాపత్రయపడింది కూడా లేదు. కానీ వివిధ పదవులు విశాలమైన, సమగ్రమైన, స్పష్టమైన అవగాహన వల్ల ఆయనను వరించాయి.

ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు 1935 జులై 1వ తేదీన జన్మించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా బాపట్ల మండలం కొండుభట్ల పాలెం ఆయన స్వస్థలం. 1983 నుంచి 2012 వరకు ఆయన టిడిపిలో ఉన్నారు. 2012 నవంబర్ లో ఆయన వైఎస్సార్ పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్యేగా పనిచేశారు. తెనాలి నుంచి 1991, 1999ల్లో లోకసభకు ప్రాతినిధ్యం వహించారు. వివిధ కమిటీల్లో ఆయన పనిచేశారు. మంత్రి పదవులు కూడా నిర్వహించారు. టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడిగా పనిచేశారు. టిడిపి పబ్లిసిటీ వింగ్ అధ్యక్షుడిగా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పనిచేశారు. 

ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తన సతీమణి సరోజినీ దేవి కోల్పోయారు. ఆయనకు ముగ్గురు కుమారులు, ఒక కూతురు. మంత్రిగా, ఎంపీగా పనిచేసినప్పిటికీ ఆయన గానీ, ఆయన కుటుంబం గానీ ఏ విధమైన వివాదాల్లోకి కూడా వెళ్లలేదు.