జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీతో జతకట్టేందుకు సిద్దమవుతున్నారన్న వార్తల నేపథ్యంలో.. వైకాపా నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వరరావు స్పందించారు. రాబోయే ఎన్నికల్లో పవన్ మద్ధతిచ్చినా తాము ఒంటరిగానే పోటీ చేస్తామన్నారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ.. దేశంలో పదికి పైగా రాష్ట్రాల్లో అమల్లో ఉన్న ప్రత్యేకహోదాను ఏపీకి ఇవ్వకుండా టీడీపీ అడ్డుకుంటోందన్నారు..

ఎన్నికల సమయంలో మోడీ, చంద్రబాబులు తాము అధికారంలోకి వస్తే.. ప్రత్యేకహోదా ఇస్తామని హామీ ఇచ్చారని.. కానీ అధికారంలోకి రాగానే మోడీ, చంద్రబాబులు హోదాపై మాట మార్చారన్నారు. హోదాకు బదులు ప్యాకేజీ ప్రకటన వినగానే రక్తం మరిగిందన్న చంద్రబాబు.. ఐదే ఐదు నిమిషాల్లో ఎందుకు చల్లబడ్డారో ఏపీ ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మా దీక్షలను, ధర్నాలను పలుమార్లు సీఎం ఎగతాళి చేశారని.. విశాఖలో కొవ్వొత్తుల ర్యాలీకి వెళ్తుంటే జగన్‌ను అడ్డుకున్నారని తెలిపారు.

హోదా ఏమైనా సంజీవనా.. హోదా ఉన్న రాష్ట్రాలు ఏం సాధించాయని ఎదురు ప్రశ్నించారు.. ఆపై కేంద్రం ఏ ప్రకటన చేసినా శాలువాలు కప్పి వారికి ధన్యవాదాలు తెలిపారని విమర్శించారు. అవిశ్వాసం సందర్భంగా 50 మంది ఎంపీల మద్ధతు లభిస్తే చర్చ జరుగుతుందని చంద్రబాబుకు తెలుసని.. ఎవరు పోరాడినా మద్ధతిస్తామన్న ముఖ్యమంత్రి 10 గంటల్లోనే మళ్లీ యూటర్న్ తీసుకున్నారని.. వైసీపీకి మేం ఎందుకు మద్థతివ్వాలని ప్రశ్నించారని అన్నారు.. రాజీనామా చేయాలని అప్పీల్ చేశాం...కానీ రాజీనామా అనగానే దూరం జరిగారని  అన్నారు.. వాళ్లు సహకరిస్తే పరిస్థితి మరోలా ఉండేదన్నారు.. అవిశ్వాసం విషయంలో వెనక్కి తగ్గింది.. డ్రామాలాడింది తెలుగుదేశం పార్టీయేనంటూ ఉమ్మారెడ్డి ఫైరయ్యారు.