సారాంశం

తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని తిరిగి వెళుతుండగా తిరుపతి బస్టాండ్ లో ఓ రెండేళ్ల బాలుడు మిస్సయ్యాడు. 

తిరుపతి : రెండేళ్ల చిన్నారి మిస్సింగ్ తిరుపతిలో కలకలం రేపుతోంది. రాత్రి తల్లిదండ్రులతో కలిసి తిరుపతి బస్టాండ్ లో పడుకున్న బాలుడు అర్ధరాత్రి లేచిచూసేసరికే కనిపించలేదు. దీంతో కంగారుపడిపోయిన తల్లిదండ్రులు బస్టాండ్ చుట్టుపక్కల వెతికినా బాలుడి ఆచూకీ లభించలేదు. దీంతో ఆ తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. 

వివరాల్లోకి వెళితే... తమిళనాడు రాజధాని చెన్నై పట్టణంలోని వలసరవక్కం ప్రాంతానికి చెందిన రామస్వామి చంద్రశేఖర్ కుటుంబంతో కలిసి తిరుమలకు వెళ్ళాడు. ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని రామస్వామి కుటుంబం సోమవారం రాత్రి స్వస్థలానికి తిరుగుపయనం అయ్యింది. అయితే తిరుపతికి చేరుకునేసరికి రాత్రి కావడం... ఆ సమయంలో చెన్నైకి బస్సులేమీ లేకపోవడంతో బస్టాండ్ లోని ప్లాట్ పారం 3పై పడుకున్నారు. 

వీడియో

ఇలా రాత్రి రామస్వామి రెండేళ్ల కొడుకు అరుల్ మురుగన్(2) తల్లిదండ్రులతో పాటే పడుకున్నాడు. కానీ అర్ధరాత్రి రెండుగంటల సమయంలో రామస్వామికి మెలకువ రాగా పక్కనే పడుకున్న కొడుకు కనిపించలేదు. దీంతో కంగారుపడిపోయిన అతడు భార్యను నిద్రలేపాడు. ఇద్దరూ కలిసి  బస్టాండ్ పరిసరాలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికారు. అయినా కొడుకు కనిపించకపోవడంతో వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేసారు. 

Read More  అమానుషం... ఆరేళ్ల చిన్నారిపై అరవయేళ్ల వృద్దుడు అత్యాచారం

వెంటనే పోలీసులు తిరుపతి బస్టాండ్ కు చేరుకుని చుట్టుపక్కల సిసి కెమెరాలను పరిశీలించారు. బాలుడు అర్ధరాత్రి సమయంలో బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం సర్కిల్ వైపునుండి కేన్సస్ హోటల్ వెళ్లినట్లు రికార్డయ్యింది. దీంతో అటువైపు పోలీసులు గాలింపు చేపట్టారు. బాలుడు ఎక్కడయినా కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని తిరుపతి వాసులను పోలీసులు కోరుతున్నారు.