అనకాపల్లి అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో పేలుడు: ఏడుగురికి గాయాలు
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో ఫార్మా కంపెనీలో ఇవాళ పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఏడుగురు కార్మికులు గాయపడ్డారు.
అనకాపల్లి: జిల్లాలోని అచ్యుతాపురం లో సాహితీ ఫార్మా కంపెనీలో శుక్రవారం నాడు పేలుడు చోటు చేసుకుంది. ఈ పేలుడులో ఏడుగురు కార్మికులు గాయపడ్డారు. నలుగురిని కిమ్స్ కు, మరో ముగ్గురిని కేజీహెచ్ కు తరలించారు.
ఈ పేలుడు కారణంగా భయంతో కార్మికులు పరుగులు తీశారు. ఈ ఫ్యాక్టరీలోని రెండు రియాక్టర్లు భారీ శబ్దంతో పేలినట్టుగా సమాచారం. దీంతో భారీగా మంటలు వ్యాపించాయి. మంటల కారణంగా పొగ సమీప ప్రాంతాలకు కన్పిస్తున్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో 35 మంది కార్మికులు పనిచేస్తున్నారని అధికారులు చెప్పారు.
రియాక్టర్ల పేలుడు కారణంగా కంపెనీలో భారీగా శబ్దాలు విన్పిస్తున్నాయి. దీంతో స్థానికులు భయాందోళనలు చెందుతున్నారు. ఇదిలా ఉంటే ఫార్మా కంపెనీలో చెలరేగిన మంటలను ఏడు ఫైరింజన్లు ఆర్పివేస్తున్నాయి.
ఈ విషయం తెలిసిన వెంటనే మంత్రి గుడివాడ అమర్ నాథ్ జిల్లా కలెక్టర్ తో మాట్లాడారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు. సంఘటన స్థలానికి జిల్లా కలెక్టర్ రవి సుభాష్ చేరుకున్నారు. సహాయక చర్యలను వేగవంతం చేశారు. ఫార్మా కంపెనీలోని రసాయనాలు మంటలు మరింత వేగంగా వ్యాపిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ ఫార్మా కంపెనీలో ప్రమాదానికి గల కారణాలపై అధికారులు అన్వేషిస్తున్నారు.
సాహితీ ఫార్మా కంపెనీలో మంటలను ఆర్పివేస్తున్న ఫైర్ ఫైటర్లపై రసాయనాలు ఎగిసిపడడంతో ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. ఇద్దరు ఫైర్ ఫైటర్లను ఆసుపత్రికి తరలించారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు మూడు వైపుల ఫైరింజన్లు ప్రయత్నిస్తున్నాయి.