ఆస్పత్రికి వెళ్లి వస్తామంటూ ఇంట్లో చెప్పి వెళ్లారు. సాయంత్రమైనా ఇంటికి తిరిగి రాలేదు.  చుట్టుపక్కల గాలించినా ఆచూకీ కూడా లభించలేదు. దీంతో.. కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు.  నెల్లూరు జిల్లా వెంకటగిరి మండలం జీకేపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు మహిళలు, ముగ్గురు చిన్నారులు కనిపించకుండా పోయారు. వీరి అదృశ్యం స్థానికంగా మిస్టరీగా మారింది.

పూర్తి వివరాల్లోకి వెళితే..  జీకేపల్లికి చెందిన కృష్ణయ్య, సుధాకర్ లు అన్నదమ్ములు. వీరిద్దరూ తమ దగ్గరి బంధవులను పెళ్లి చేసుకున్నారు. కృష్ణయ్యకు భార్య విజయ(26), కుమార్తెలు శ్రీవేణి(3), దివ్య శ్రీ(7)లు ఉన్నారు. కాగా.. సుధాకర్ కి భార్య సుప్రియ(25), కుమార్తె సురేఖ(2) ఉన్నారు. అయితే.. రెండు రోజులుగా దివ్యశ్రీకి ఆరోగ్యం సరిగా ఉండటం లేదు.

దీంతో.. తోటికోడళ్లు ఇద్దరూ ముగ్గురు పిల్లలను తీసుకొని ఆస్పత్రికి వెళతామని బయలు దేరారు. ఆస్పత్రిలో డైరెక్ట్ గా డాక్టర్ దగ్గరకు వెళ్లడంతో.. వైద్యులు ఓపీ స్లిప్ తీసుకు రావాలని చెప్పారు. అక్కడ చాలా ఆలస్యం కావడంతో.. ప్రైవేటు ఆస్పత్రికి వెళ్తామని ఆటోలో బయలు దేరారు. అలా వెళ్లిన వాళ్లు.. తిరిగి మళ్లీ ఇంటికి చేరుకోలేదు. ఆందోళన చెందిన సుధాకర్, కృష్ణయ్యలు భార్య, పిల్లల కోసం చాలా చోట్ల గాలించారు.

ఆచూకీ మాత్రం లభించలేదు. దీంతో.. వెంటనే పోలీసులను ఆశ్రయించారు. పోలీసులకు కూడా వారి ఆచూకీ లభించకపోవడం గమనార్హం. సదరు ఇద్దరు మహిళలు నైటీల్లోనే పిల్లను తీసుకొని ఆస్పత్రికి వెళ్లారు. అంతేకాకుండా.. వారు తమ సెల్ ఫోన్ లను కూడా ఇంట్లోనే ఉంచారు. వారి కోసం అన్వేషిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.