పిల్లి కరిచి ఇద్దరు మహిళలు మృతిచెందిన ఘటన కృష్ణా జిల్లాలో (krishna district) చోటుచేసుకుంది. పిల్లి కరిచిన (cat bite) రెండు నెలల తర్వాత వారిద్దరు ఒకే రోజు మరణించారు. 


పిల్లి కరిచి ఇద్దరు మహిళలు మృతిచెందిన ఘటన కృష్ణా జిల్లాలో (krishna district) చోటుచేసుకుంది. పిల్లి కరిచిన (cat bite) రెండు నెలల తర్వాత వారిద్దరు ఒకే రోజు మరణించారు. రేబిస్‌ వ్యాధి సోకడంతోనే వారు మరణించినట్టుగా వైద్యులు చెబుతున్నారు. వివరాలు.. కృష్ణా జిల్లా మొవ్వ మండలం వేములమడ ఎస్సీ కాలనీకి చెందిన రిటైర్డ్‌ ఆర్టీసీ కండక్టర్‌ సాలి భాగ్యారావు భార్య కమల (64), అదే కాలనీలోని ఆర్‌ఎంపీ వైద్యుడు బొడ్డు బాబూరావు భార్య నాగమణి (43)లను రెండు నెలల క్రితం పిల్లి కరిచింది. దీంతో ఆందోళన చెందిన వారు టీటీ ఇంజెక్షన్ తీసుకున్నారు. గాయాలు తగ్గడానికి మెడిసిన్ వాడటంతో రిలీఫ్ లభించింది. దీంతో వారు తమ రోజు వారి పనుల్లో నిమగ్నమై పోయారు.

అయితే గత నాలుగు రోజులుగా కమల, నాగమణి ఆరోగ్యంలో త్రీవ మార్పులు రావడంతో ఆస్పత్రుల్లో చేరారు. కమల మంగళగిరి ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రిలో చేరింది. మరోవైపు నాగమణి శుక్రవారం మొవ్వ పీహెచ్‌సీలో వైద్యం చేయించుకుని అక్కడి వైద్యుల సూచన మేరకు విజయవాడలోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రిలో చేరింది. అయితే పరిస్థితి విషమించడంతో నాగమణి చికిత్స పొందుతూ శనివారం వేకువజామున మృతి చెందింది. ఇదిలా ఉంటే ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కమల కూడా శనివారం ఉదయం 10 గంటలకు మృతిచెందింది.

పిల్లి కరిచిన రెండు నెలల తర్వాత ఇద్దరు మహిళలు ఒకే రోజు మృతిచెందడం వేములమడలో తీవ్ర విషాదాన్ని నింపింది. పిల్లి కరవడంతో ఇద్దరికీ రేబిస్ సోకిందని వైద్యాధికారి డాక్టర్‌ శొంఠి శివరామకృష్ణారావు తెలిపారు. సకాలంలో వైద్య సేవలు అందకపోవడంతో శరీరం విషతుల్యమైందన్నారు. పిల్లి, కుక్క, ఎలుక.. వంటివి కరిస్తే వెంటనే సమీప ఆరోగ్య కేంద్రాల్లో తగిన వైద్యం తీసుకోవాలని చెప్పారు. ఇక, మృతిచెందిన ఇద్దరు మహిళలను కరిచిన పిల్లిని ఓ కుక్క కరిచిందని, ఆ కుక్క కూడా కొద్దిరోజులకే చనిపోయిందని గ్రామస్తులు తెలిపారు.