గుంటూరు జిల్లా చిలకలూరిపేట వైసీపీ ఎమ్మెల్యే విడుదల రజనీపై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టిన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నెల్లూరు జిల్లా విడవలూరుకు చెందిన సత్యవోలు హరిప్రసాద్రెడ్డి ఆలియాస్ సత్యంరెడ్డి.. ఎమ్మెల్యేపై ఫేస్‌బుక్‌లో అభ్యంతరకర వ్యాఖ్యలతో పోస్ట్ చేశాడు.

Also Read:ఆధ్మాత్మిక యాత్రలో రియల్ హీరో: సాహో సజ్జనార్ అంటూ.....

దీని కింద అదే జిల్లా రాపూరు మండలం కండలేరు డ్యాంకు చెందిన పంతగాని ప్రవీణ్ అసభ్యకర కామెంట్స్ చేసినట్లు చిలకలూరిపేటకు చెందిన వైసీపీ నేత మారుబోయిన నాగరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Also Read:చంద్రబాబు చుట్టూ బిగుసుకుంటున్న ఉచ్చు... ముప్పేటదాడికి కేసులు సిద్ధం

కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆదివారం నెల్లూరు జిల్లాలోని నిందితుల గ్రామాలకు వెళ్లి సత్యంరెడ్డి, ప్రవీణ్‌ను అరెస్ట్ చేశారు. అనంతరం చిలకలూరిపేట అర్బన్ పోలీస్ స్టేషన్‌లో ఐపీసీ సెక్షన్ 509, సెక్షన్ 67 ఐటీ యాక్ట్-2008 కింద కేసులు నమోదు చేశారు. వీరిద్దరిని సోమవారం కోర్టులో హాజరుపరచనున్నారు.

కాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన దిశ యాక్ట్-2019 ప్రకారం సోషల్‌మీడియా ద్వారా మహిళలను వేధించడం, వారిపై అసభ్య పోస్టింగులు పెట్టడం లాంటివి చేస్తే కఠిన శిక్షలు విధించనున్నారు.

ఈ చట్టం ద్వారా మెయిల్స్‌ ద్వారా గాని, సోషల్‌ మీడియా ద్వారా గాని, డిజిటల్‌ విధానంలోగాని మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లయితే మొదటి తప్పుకు 2 ఏళ్లు, ఆతర్వాత తప్పుకు 4 ఏళ్లు శిక్ష విధించేలా ఐపీసీలో 354 (ఇ) అనే కొత్త సెక్షన్‌ను తీసుకు వచ్చారు.