కృష్ణాజిల్లా గన్నవరం పోలీస్ స్టేషన్ ముందు ఇద్దరు యువకులు ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. వారం రోజుల క్రితం బైక్‌పై వెళుతున్న అన్నాచెల్లెళ్లు రోడ్డుపక్కనే కూర్చొన్న ఇద్దరు యువకులను బైక్‌తో ఢీకొట్టారు.

దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలో యువతిని ఇద్దరు యువకులు చేయిపట్టుకుని లాగారని, ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారంటూ అన్నాచెల్లెళ్లు గన్నవరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారం రోజులుగా విచారణ జరుపుతున్నారు.

తాము ఏ నేరం చేయలేదని, కావాలనే వారిద్దరూ ఇబ్బందిపెడుతున్నారంటూ.. ఇద్దరు యువకులు మంగళవారం ఉదయం పోలీస్ స్టేషన్ ముందు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు వారిని గన్నవరంలోని పిన్నమనేని మెడికల్ కాలేజ్ ఆస్పత్రిలో చేర్పించారు.

అక్కడ చికిత్స పొందుతున్న ఇద్దరిలో గండికోట కోటేశ్వరరావు అనే యువకుడు నిన్న రాత్రి మరణించాడు. పోలీసుల వేధింపుల వల్ల యువకుడు మరణించాడంటూ మృతుడి తరపు కుటుంబసభ్యులు, బంధువులు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు.