విజయవాడ రూరల్ మండలం నిడమానురు బైపాస్ వద్ద జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆర్మీ జవాన్ సహా మరొకరు దుర్మరణం చెందారు.
విజయవాడ: ఇవాళ (మంగళవారం) తెల్లవారుజామున ఎన్టీఆర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపక్కన ఆగివున్న డిసిఎంను అతివేగంతో వెళుతున్న కారు వెనకనుండి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులోని ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
వివరాల్లోకి వెళితే... శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన హరీష్(29)ఆర్మీలో ఉద్యోగం చేస్తున్నాడు. ప్రస్తుతం సెలవులు వుండటంతో స్వస్థలానికి వచ్చాడు. ఈ క్రమంలోనే హైదరాబాద్ వుండే చెల్లిని చూడటానికి కారులో ఒక్కడే బయలుదేరాడు. మార్గమధ్యలో బీమవరం ఉండి గ్రామానికి చెందిన గాదిరాజు హర్ష అనే వ్యక్తి లిప్ట్ అడగటంతో ఎక్కించుకున్నాడు.
Video
ఇలా వీరు ప్రయాణిస్తున్న కారు తెల్లవారుజామున విజయవాడ రూరల్ మండల నిడమానురు జాతీయ రహదారిపై ప్రమాదానికి గురయ్యింది. బైపాస్ దగ్గరకు రోడ్డుపక్కన ఆగివున్న డీసిఎంను వేగంగా దూసుకుపోతున్న కారు వెనకనుండి ఢీకొట్టింది. దీంతో కారులోని ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు.
ప్రమాదాన్ని గమనించినవారు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పటమట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అతివేగంతో పాటు డ్రైవర్ నిద్రమత్తు ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. తెల్లవారుజామున డ్రైవర్ నిద్రమత్తులో కారును వేగంగా పోనిస్తూ రోడ్డుపక్కన ఆగివున్న డిసిఎంను గమనించలేడని... దీంతో వెనకనుండి ఢీకొట్టడంతో కారు తుక్కుతుక్కు అయ్యింది. ఇందులో నలిగి ఆర్మీ ఉద్యోగితో పాటు మరొకరు మృతిచెందారు.
ఇదిలావుంటే కర్ణాటకలోని హుబ్లీ శివారులో బస్సు, లారీ ఢీకొన్న ఘటనలో ఏడుగురు మరణించారు. హుబ్లీలోని కిమ్స్ ఆసుపత్రికి క్షతగాత్రులను తరలించారు. ఈ రోడ్డు ప్రమాదంలో బస్సు, లారీ డ్రైవర్లు ఘటన స్థలంలోనే మరణించారు. ప్రయాణీకులతో బస్సు కొల్హాపూర్ నుండి బెంగుళూరు వెళ్తుంది. ఈ సమయంలో అర్ధరాత్రి ధర్వాడ్ వైపు వెళ్తున్న లారీని బస్సు ఢీకొట్టింది. ట్రాక్టర్ ను ఓవర్ టేక్ చేసే ప్రయత్నంలో బస్సు డ్రైవర్ లారీని ఢీకొట్టాడని పోలీసులు చెప్పారు.
ఇక ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని బులంద్ షహార్ లో ఇదే తరహాలో ప్రమాదం చోటు చేసుకుంది. గులాయోతి పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఆగి ఉన్న ట్రక్కును కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించారు.
