గుంటూరులో లాడ్జి సెంటర్‌లోని నార్త్ ప్యారిస్ చర్చిలో వివాదం చోటుచేసుకుంది. ప్రార్థనలు చేసే అధికారం విషయంలో శ్యామ్ సంపత్, పరదేశీబాబు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది.

గుంటూరులో లాడ్జి సెంటర్‌లోని నార్త్ ప్యారిస్ చర్చిలో వివాదం చోటుచేసుకుంది. ప్రార్థనలు చేసే అధికారం విషయంలో శ్యామ్ సంపత్, పరదేశీబాబు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. వివరాలు.. నార్త్ ప్యారిస్ చర్చిలో పరదేశి బాబు వర్గానికి చెందిన పాస్టర్ బాబురావు ఆదివారం ఉదయం ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. అయితే అదే సమయంలో శ్యామ్ సంపత్ వర్గానికి చెందిన పాస్టర్ కెన్నెడీ చర్చిలోకి వచ్చారు. అయితే ప్రార్థనలు నిర్వహించేందుకు తమకు కోర్టు అనుమతి ఇచ్చిందని పాస్టర్ కెన్నెడీ చెప్పారు. 

ఈ క్రమంలోనే ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇరువర్గాలకు చెందినవారు పరస్పరం కుర్చీలు విసురుకున్నారు. ఈ ఘర్షణలో ఇరువర్గాలకు చెందిన పలువురికి గాయాలు అయ్యాయి. చర్చిలో ఇరువర్గాల ఘర్షణతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇందుకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. చర్చి వద్ద మరోసారి ఘర్షణ చోటుచేసుకోకుండా పోలీసు సిబ్బందిని మోహరించారు.