తాగిన మైకంలో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన సంభాషణ ఒకరి ప్రాణాల మీదకు వచ్చింది. వివరాల్లోకి వెళితే.. వైఎస్సార్ కడప జిల్లా చింతకొమ్మ దిన్నె సమీపంలోని మద్దిమడుగుకి చెందిన కిశోర్ నాయక్, సుగాలి బిడికికి చెందిన రామాంజనేయులు ఓ బావి గట్టున కూర్చొని ఫూటుగా మద్యం సేవించారు.

ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటుండగా.. వీరిద్దరి మాటలు దేవుడి మీదకు వెళ్లాయి. కిషోర్ నాయక్ దేవుడు వున్నాడని వాదించడంతో రామాంజనేయులు లేడని వాదించాడు. వీరి వాదనలు తారాస్థాయికి చేరాయి.

ఇక కిషోర్ తాగిన మైకంలో పక్కనే వున్న బావిలో గంగమ్మ తల్లి ఉంటుందని ఆమెను చూపిస్తానిని వాదిస్తూ.. బావిలోకి దిగే ప్రయత్నం చేశాడు. అలా బావిలో వున్న ఓ రాయిపై కిశోర్ నాయక్ కాలు వేయటంతో ఆ రాయి విరిగి సుమారు 70 అడుగుల లోతున పడిపోయాడు.

దీంతో ఆందోళన చెందిన రెండో వ్యక్తి స్థానికులకు సమాచారం అందించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని బావిలో పడ్డ వ్యక్తిని రక్షించి, ఆసుపత్రికి తరలించారు.