విజయవాడలో విషాదం: బాణసంచా దుకాణంలో అగ్నిప్రమాదం, ఇద్దరు సజీవ దహనం
విజయవాడ నగరంలోని జింఖానా గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన బాణసంచా దుకాణంలో ఆదివారం నాడు అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు సజీవ దహనమయ్యారు. ఫైరింజన్లు మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నాయి
విజయవాడ: నగరంలోని జింఖానా గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన బాణసంచా దుకాణంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకొని ఇద్దరు సజీవ దహనమయ్యారు. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో మంటల్లో వారిద్దరూ సజీవ దహనమయ్యారు.మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.
దీపావళిని పురస్కరించకొని విజయవాడలోని జింఖానా గ్రౌండ్స్ లో బాణసంచా దుకాణం ఏర్పాటు చేశారు. అయితే ఆదివారం నాడు ఉదయం ప్రమాదవశాత్తు ఈ దుకాణంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో దుకాణంలో ఉన్నబాణాసంచా పేలింది.దీంతో బాణసంచా కొనుగోలు చేసేందుకు వచ్చిన వినియోగదారులతో పాటు అక్కడే ఉన్నవారంతా భయబ్రాంతులకు గురయ్యారు. ఈ బాణసంచా దుకాణం పక్కనే పెట్రోల్ బంక్ ఉంది. బాణసంచా దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగిన విషయాన్ని స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఈ సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మంటలను ఆర్పుతున్నారు.
అగ్నిప్రమాదం కారణంగా ఇక్కడ ఏర్పాటు చేసిన మూడు బాణసంచా దుకాణలు పూర్తిగా దగ్దమయ్యాయి. బాణసంచా దుకాణంలో పని చేస్తున్న ఇద్దరు సజీవ దహనమైనట్టుగా పోలీసులు గుర్తించారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలను పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఈ అగ్ని ప్రమాదంలో మరణించిన వారిని గుర్తించారు.విజయవాడకు చెందిన కాశీ, పిడుగురాళ్లకు చెందిన సాంబగా పోలీసులు గుర్తించారు.టపాసుల దుకాణంలో పనిచేస్తూ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారని పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన స్థలాన్ని ఎమ్మెల్యే మల్లాది విష్ణు, విజయవాడ సీపీ కాంతి రాణా టాటా పరిశీలించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేశామని విజయవాడ సీపీ కాంతి రాణా టాటా చెప్పారు. ఫైర్ నిబంధనలు పాటించిన వారికే బాణసంచా దుకాణాలకు అనుమతిని ఇచ్చినట్టుగా సీపీ చెప్పారు. టపాకాయలు దిగుమతి చేస్తున్న సమయంలో ప్రమాదం జరిగిందని సీపీ వివరించారు.