Asianet News TeluguAsianet News Telugu

నెల్లూరు కోర్టులో చోరీలో ఇద్దరు అరెస్ట్: జిల్లా ఎస్పీ విజయరావు


నెల్లూరు కోర్టు చోరీ ఘటనలో  ఇద్దరిని అరెస్ట్ చేసినట్టుగా ఎస్పీ విజయరావు చెప్పారు. ఈ ఘటన రాజకీయంగా కలకలం రేపింది. ఈ  ఘటనలో చోరీకి గురైన వస్తువులను రికవరీ చేశామని ఎస్పీ వివరించారు.

Two arrested in Court theft case says nellore sp vijayarao
Author
Nellore, First Published Apr 17, 2022, 2:13 PM IST

నెల్లూరు: నెల్లూరు కోర్టులో చోరీ ఘటనలో ఇద్దరిని అరెస్ట్ చేసినట్టుగా ఎస్పీ విజయరావు చెప్పారు. కోర్టులో చోరీకి గురైన వస్తువులను రికవరీ చేశామని ఆయన వివరించారు.ఆదివారం నాడు నెల్లూరు ఎస్పీ మీడియాతో మాట్లాడారు.   కోర్టు ప్రాంగణంలో ఇనుము చోరీ కోసం నిందితులు వచ్చారన్నారు. కుక్కలు వెంబడించడంతో నిందితులు కోర్టు  తాళం పగులగొట్టి లోపలికి వెళ్లారని ఎస్పీ చెప్పారు. కోర్టు లోపల ఉన్న బీరువాలో బ్యాగును తీసుకెళ్లారన్నారు. కోర్టులో చోరీకి గురైన అన్ని వస్తువులను రికవరీ చేశామన్నారు. నిందితులు  సయ్యద్ హయత్ , ఖాజా రసూల్ ను అరెస్ట్ చేసినట్టుగా ఎస్పీ తెలిపారు. కోర్టులో నిందితులు తీసుకెళ్లిన బ్యాగ్ నుండి సెల్ ఫోన్, ల్యాప్ టాప్ తీసుకొని మిగిలిన వాటిని నిందితులు పారేశారని ఎస్పీ వివరించారు.

నెల్లూరులోని కోర్టులో గురువారం నాడు రాత్రి చోరీ జరిగింది. మలేషియా, సింగపూర్, హాంగ్ కాంగ్ లలో సోమిరెడ్డికి ఆస్తులు ఉన్నాయని, పెద్దమొత్తంలో లావాదేవీలు జరిపారని కాకాని గతంలో ఆరోపణలు చేశారు. అంతేకాకుండా, ఇందుకు సంబంధించిన కొన్ని పత్రాలనూ ఇటీవల విడుదల చేశారు. ఆ పత్రాలను మీడియా ముందు కూడా ఉంచారు. అయితే ఆ పత్రాలన్నీ నకిలీవని, తనపై లేనిపోని అభాండాలు వేస్తున్నారని, ఈ నకిలీ పత్రాలు సృష్టించిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు సోమిరెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కాకాని గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. 

సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై కాకాని గోవర్ధన్ రెడ్డి విడుదల చేసిన పత్రాలు ఫోర్జరీవిగా పోలీసులు గుర్తించారు. కాకాని గోవర్ధన్ రెడ్డి  తెచ్చిన డాక్యుమెంట్లు ఫోర్జరీవి అని తేలిందని ఫోరెన్సిక్ లేబోరేటరీ తేల్చింది. అసలు సోమిరెడ్డి మలేషియాకు వెళ్లలేదని ఇమ్మిగ్రేషన్ అధికారులు ధృవీకరించారు. ఫోర్జరీ డాక్యుమెంట్ల కేసులో కొందరిని అరెస్టు కూడా చేశారు. ఈ మేరకు పలువురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. 

ఈ కేసుకు సంబంధించి పోలీసులు చార్జీషీట్ ను కూడా దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించిన ఆధారాలను కోర్టులో భద్రపర్చారు.  అయితే కోర్టులో భద్రపర్చిన ఆధారాలు చోరీకి గురి కావడం ప్రస్తుతం కలకలం రేపుతుంది.  కాకానిపై ఉన్న కేసుకు సంబంధించిన ఆధారాలతో పాటు ఇతర కేసులకు సంబంధించిన ఆధారాలు కూడా చోరీకి గురికావడం ప్రస్తుతం చర్చకు దారి తీసింది. ఈ ఘటనపై కోర్టు సిబ్బంది చిన్నబజార్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios