విజయవాడ: విజయవాడ నోవాటెల్ హోటల్ వద్ద కారులో పెట్టి హత్యాయత్నం కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకొంది.  గంగాధర్ దంపతులతో పాటు కృష్ణారెడ్డి అనే  వ్యక్తి  ఈ ఘటనలో గాయపడ్డారు. కృష్ణారెడ్డి తీవ్రంగా గాయపడ్డారు.  గంగాధర్ ఆయన భార్య నాగమణిలు ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు.

హత్యాయత్నం కేసులో నిందితుడు వేణుగోపాల్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ కేసులో ఆసక్తికర విషయాలను పోలీసులు దర్యాప్తులో తెలుసుకొన్నారు. 

తనకు తెలిసిన తహసీల్దార్ కు రూ. 5 కోట్లు వచ్చాయని వేణుగోపాల్ రెడ్డి గంగాధర్ దంపతులతో పాటు కృష్ణారెడ్డిని నమ్మించినట్టుగా చెబుతున్నారు. పేదలకు ఇళ్ల పట్టాల కోసం బినామీలుగా తహసీల్దార్ కు భూమిని ఇప్పిస్తే రూ. 2 కోట్లు వస్తాయని వేణుగోపాల్ రెడ్డి చెప్పాడని బాధితులు చెప్పారని సమాచారం.

తహసీల్దార్ ను కలిసేందుకు వెళ్లాలని చెప్పి గంగాధర్ దంపతులతో పాటు కృష్ణారెడ్డిని కూడ వేణుగోపాల్ రెడ్డి తీసుకొచ్చాడని చెబుతున్నారు. తొలుత గుంటూరు ఈస్ట్ స్ట్రీట్ కు తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఖలీల్ దాబాకు కారులో వెళ్లారు. 

అయితే తహాసీల్దార్ ఏలూరుకు వెళ్తున్నాడని చెప్పి బెజవాడలో కలుద్దామని చెప్పడంతో నోవాటెల్ హోటల్ వద్దకు తీసుకొచ్చారని పోలీసుల విచారణలో తేలింది. మద్యం బాటిల్ అంటూ  ఓ బాటిల్ ను తీసుకొచ్చాడని బాధితులు చెప్పారు.

మద్యం బాటిల్ గా తెచ్చిన బాటిల్ శానిటైజర్ గా అనుమానిస్తున్నారు. శానిటైజరా... పెట్రోలా అనే కోణంలో కూడ విచారణ చేస్తున్నారు. కారు లోపల, బయట శానిటైజర్ ను పోసి నిప్పంటించి కారుకు లాక్ చేసి వేణుగోపాల్ రెడ్డి వెళ్లిపోయినట్టుగా బాధితులు పోలీసులకు సమాచారం ఇచ్చారని తెలుస్తోంది.

also read:భూ వివాదం: విజయవాడలో సినీ ఫక్కిలో హత్యాయత్నం, ఒకరికి గాయాలు

వేణుగోపాల్ రెడ్డితో గంగాధర్ మధ్య వ్యాపార లావాదేవీలు ఉన్నట్టుగా చెబుతున్నారు. ఈ క్రమంలోనే వీరి మధ్య ఆర్ధిక పరమైన లావాదేవీలు జరిగాయి. ఈ క్రమంలోనే వీరి మధ్య ఆర్దిక లావాదేవీల విషయంలో గొడవలు జరుగుతున్నట్టుగా పోలీసులు గుర్తించారు. 

అయితే వేణుగోపాల్ రెడ్డి తహసీల్దార్ పేరు చెప్పి బయటకు రప్పించాడు. నిజంగానే తహాసీల్దార్ తో మాట్లాడేందుకు ప్రయత్నాలు చేశారా.. లేక ఇలా చెబితే వారు వస్తారని భావించారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.