విజయవాడ:  భూ వివాదంలో  సినీ ఫక్కిలో హత్య చేసేందుకు చేసిన ప్రయత్నం విఫలమైంది. ఈ ఘటనలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. మరో ముగ్గురు ప్రమాదం నుండి తప్పించుకొన్నారు. ఈ ఘటన కృష్ణా జిల్లాలోని విజయవాడలో సోమవారం నాడు చోటు చేసుకొంది.

భూ వివాదం నేపథ్యంలో నలుగురిని హత్య చేసేందుకు వేణుగోపాల్ రెడ్డి ప్లాన్ చేసినట్టుగా బాధితులు ఆరోపిస్తున్నారు.భూ వివాదంలో విజయవాడలోని నోవాటెల్  హోటల్ కు నలుగురిని వేణుగోపాల్ రెడ్డి రప్పించాడు. కారులో నలుగురిని బంధించి పెట్రోలు పోసి నిప్పంటించారు. 

అయితే ఈ ఘటనలో కారు పూర్తిగా దగ్దమైంది. కారులో ఉన్న ఒక్కరు తీవ్రంగా గాయపడ్డాడు. మరో ముగ్గురు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన జరిగిన ప్రాంతాన్ని పోలీసులు పరిశీలించారు. భూ వివాదం నేపథ్యంలో ఆర్ధిక విబేధాలు చోటు చేసుకొన్నట్టుగా చెబుతున్నారు.

ఆర్ధిక లావాదేవీల మధ్య విబేధాల కారణంగానే ఈ ఘటన చోటు చేసుకొందని పోలీసులు అనుమానిస్తున్నారు. గంగాధర్, వేణుగోపాల్ రెడ్డి మధ్య ఆర్ధిక లావాదేవీల విషయంలో గొడవలు ఉన్నట్టుగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.

గంగాధర్, నాగవల్లి దంపతులు రూ. 3 కోట్లను ఎగ్గొట్టారనే సమాచారం. ఈ విషయమై గంగాధర్, వేణుగోపాల్ రెడ్డి మధ్య వివాదాన్ని పరిష్కరించేందుకు కృష్ణారెడ్డి అనే వ్యక్తి మధ్యవర్తిగా వచ్చినట్టుగా సమాచారం.

పక్కా ప్లాన్ తో నే వేణుగోపాల్ రెడ్డి కారుపై పెట్రోల్ పోసి నిప్పంటించినట్టుగా పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.