దళిత బాలికపై అత్యాచారం ఘటనలో ట్విస్ట్: మామయ్య పనే, నోట్లో గుడ్డలు కుక్కి...
దళిత బాలికపై జరిగిన అత్యాచారం కేసు కొత్త మలుపు తిరిగింది. గుంటూరు జిల్లా రాజుపాలెంలో వరుసకు మామయ్య అయ్యే వ్యక్తి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు.
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా రాజుపాలెం దళిత బాలికపై జరిగిన అత్యాచారం కేసు ట్విస్ట్ తీసుకుంది. వరుసకు మామయ్య అనే వ్యక్తే ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లు తేలింది. గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ ఈ ఘటనకు సంబంధించిన వివరాలను మీడియా ప్రతినిధులకు వెల్లిడంచారు. తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న బాలికను పిల్లలతో ఆడుకోవడానికని పిలిచాడు. ఆ తర్వాత ఆమెపై అత్యాచారం చేశాడు.
రాజుపాలెంకు చెందిన దళిత బాలిక కొంత కాలంగా ఆస్తమా, మూత్రపిండాల సమస్యలతో బాధపడుతోంది. తల్లిదండ్రులు గుంటూరులో ఉంటారు. అమ్మమ్మ, తాతయ్యల వద్దనే ఆమె ఉంటూ వస్తోంది. వారికి సమీపంలో నివసించే వ్యక్తి గల్లా లబాన్ ఆమెకు వరుసకు మామయ్య అవుతాడు. బాలికను తరుచుగా పలకరిస్తూ ఉండేవాడు.
అతనికి వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలతో దళిత బాలిక ఆడుకుంటూ ఉండేది. బాలిక అమ్మమ్మ కొద్ది రోజుల క్రితం మరణించింది. ఈ నెల 18వ తేదీన ఆమె పెద్దకర్మ కార్యక్రమాలు జరుగుతున్న సమయంలో లాబాన్ ఆ బాలికను తమ పిల్లలతో ఆడుకోవడానికి పిలిచాడు.
అన్నెం పున్నెం తెలియని ఆ బాలిక ఎప్పటి మాదిరిగానే అక్కడికి వెళ్లింది. అయితే, ఆమెకు అనూహ్యమైన పరిస్థితి ఎదురైంది. బాలికను లాబాన్ గదిలో బంధించాడు. ఆమె అరుపులు బయటకు వినిపించకుండా నోట్లో దుస్తులు కుక్కాడు. ఆ తర్వాత అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ విషయం బయటకు చెప్తే చంపేస్తానని బెదిరించి, వదిలేశాడు.