తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు (టీటీడీ) దాఖలు చేసిన పరువు నష్టం దావా ఉపసంహరణ పిటిషన్‌పై విచారణను ఏపీ హైకోర్టు నవంబర్ 2కు వాయిదా వేసింది. ఈ విషయాన్ని సీనియర్ న్యాయవాది ఆదినారాయణ తెలిపారు.

టీడీడీ మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణ దీక్షితులు, ఎంపీ విజయసాయిరెడ్డిపై టీటీడీ 2018లో పరువు నష్టం దావా దాఖలు చేసింది. ప్రస్తుతం ఆ దావా తిరుపతి పదో అదనపు జిల్లా సెషన్స్ కోర్టు విచారణలో ఉంది.

ఈ నెల 14న ఈ దావాలో తెలంగాణకు చెందిన హిందూ జనసేన శక్తి వెల్ఫేర్ అసోసియేషన్ ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసింది. గత నెల 14న టీటీడీ దావా ఉపసంహరణకు పిటిషన్ దాఖలు చేసిన విషయం వెలుగులోకి వచ్చింది.

సదరు ఇంప్లీడ్ పిటిషన్‌లో టీటీడీ, ఏవీ రమణ దీక్షితులు, విజయసాయిరెడ్డి తరపున కౌంటర్లు దాఖలు చేయాల్సిందిగా న్యాయస్థానం ఆదేశించింది. కాగా, రూ.200 కోట్ల పరువునష్టం కేసులో చెల్లించిన కోర్టు ఫీజు రూ.2కోట్లు వదులుకోవడానికి కూడా టీటీడీ సిద్ధమైంది.

‘వేంకటేశ్వరస్వామి హుండీలో డబ్బులు వేయకండి’, ‘పింక్‌ డైమండ్‌ను విదేశాల్లో వేలం వేశారు’ అంటూ రమణదీక్షితులు చెన్నై, ఢిల్లీల్లో ప్రెస్‌మీట్‌లు పెట్టడం అప్పట్లో సంచలనం రేపింది. వీటిని సమర్థిస్తూ విజయసాయిరెడ్డి కూడా అనేక ఆరోపణలు చేశారు. దాంతో వీరిద్దరూ రూ.వంద కోట్లు చొప్పున చెల్లించాలని టీటీడీ పిటిషన్‌ వేసింది.