14 రకాల వంటకాలతో భక్తులకు భోజనం: టీటీడీ సన్నాహలు
తిరుమల వెంకన్నను సందర్శించుకొనే భక్తులకు రెండు పూటల సంప్రదాయ పద్దతిలో భోజనం ఏర్పాటు చేసేందుకు టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సేంద్రీయ పద్దతిలో పండించిన కూరగాయలను ఇవ్వాలని దాతలను టీటీడీ అధికారులు కోరారు.
తిరుపతి:తిరుమల వెంకటేశ్వరస్వామి భక్తులకు ఉదయం, సాయాంత్రంపూట వేర్వేరు కూరగాయలతో భోజనం పెట్టాలని టీటీడీ నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు కూరగాయల దాతలతో టీటీడీ అధికారులు గురువారం నాడు సమావేశమయ్యారు.ప్రతి రోజూ కూరలు, సాంబారు, రసం అందించనున్నారు. అన్నప్రసాదం విభాగం కోరిన మెనూ ప్రకారంగా కూరగాయలను సరఫరా చేయాలని దాతలను కోరారు టీటీడీ అధికారులు.
ప్రతి రోజూ 90 యూనిట్లు భోజనం సరఫరా చేయాలని అధికారులు నిర్ణయించారు. అయితే ఉదయం పూట 56 యూనిట్లు, సాయంత్రం 34 యూనిట్లు భక్తులకు అన్న ప్రసాదాలు అందిస్తారు. ఒక్క యూనిట్ లో 250 మంది భక్తులకు అన్న ప్రసాదాలు అందిస్తారు. ఒక్కో యూనిట్ కు కనీసంగా 48 కిలోల కూరగాయలు అవసరమౌతాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
గో ఆధారిత ఉత్పత్తులను ఉపయోగించి సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించడంపై దృష్టి పెట్టి రసాయన రహిత కూరగాయలను పండించాలని దాతలను కోరారు.ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి ఈ సమావేశానికి సుమారు 14 మంది కూరగాయల దాతలు హాజరయ్యారు.