15 ఏళ్లలోపు పిల్లలకు మధ్యాహ్నం రెండు దాటితే నో ఎంట్రీ: చిరుత దాడితో టీటీడీ కీలక నిర్ణయం
తిరుమల నడక మార్గంలో చిరుతల దాడుల నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. మధ్యాహ్నం రెండు గంటల తర్వాత 15 ఏళ్లలోపు చిన్నారులకు అనుమతిని నిరాకరించింది టీటీడీ.
తిరుమల: తిరుమల ఘాట్ రోడ్డులో చిరుత సంచారం నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. అలిపిరి నడక మార్గం, శ్రీవారి మెట్టు మార్గంలో మధ్యాహ్నం రెండు గంటల తర్వాత 15 ఏళ్ల లోపు పిల్లలకు అనుమతిని టీటీడీ నిరాకరించింది. తిరుమల రెండో ఘాట్ రోడ్డులో సాయంత్రం ఆరు గంటలు దాటితే టూ వీలర్లను అనుమతించవద్దని నిర్ణయం తీసుకుంది టీటీడీ.
నెల రోజుల వ్యవధిలోనే ఇద్దరు చిన్నారులపై తిరుమలకు వెళ్లే దారిలో చిరుత దాడికి పాల్పడింది. రెండు రోజుల క్రితం జరిగిన ఘటనలో అక్షిత అనే చిన్నారి మృతి చెందింది. మరో ఘటనలో మరో చిన్నారి గాయపడిన విషయం తెలిసిందే.ఈ ఘటనల నేపథ్యంలో భక్తుల భద్రత విషయంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. నిన్న తిరుమల ఘాట్ రోడ్డులో పరిస్థితిని ఈఓ పరిశీలించారు.
తిరుమల నడకన మార్గంలో అలిపిరి , శ్రీవారి మెట్టు మార్గంలో మధ్యాహ్నం రెండు గంటల తర్వాత 15 ఏళ్లలోపు పిల్లలకు అనుమతిని ఇస్తే చిరుతలు దాడి చేసే అవకాశం ఉన్నందున టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. మరో వైపు అలిపిరి మార్గంలో వెళ్లే పిల్లలకు ట్యాగ్ లను ఏర్పాటు చేస్తుంది టీటీడీ.తిరుమల నడక మార్గంలో ఏడో మైలు నుండి నరసింహ స్వామి ఆలయం వరకు భక్తుల బృందాలను అనుమతించనున్నారు. భక్తుల ముందు, వెనుక రోప్ పార్టీలను టీటీడీ నియమించింది. ప్రతి 40 అడుగులకు సెక్యూరిటీని ఏర్పాటు చేసింది టీటీడీ.
also read:తిరుమలలో బాలిక మృతిపై ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
2010 జూలై 27న అలిపిరి నడక మార్గంలో మూడేళ్ల చిన్నారిపై చిరుత దాడి చేసింది. 2010 ఆగస్టు 2న ఎనిమిదేళ్ల కళ్యాణిపై చిరుత దాడి చేసింది. ఈ ఏడాది జూన్ 22న మూడేళ్ల కౌశిక్ పై చిరుత దాడి చేసింది. అయితే కౌశికన్ ను ఫారెస్ట్ సిబ్బంది కాపాడు. ఈ నెల 11న ఆరేళ్ల చిన్నారి చిరుత దాడిలో మరణించింది.చిరుత దాడులు జరిగిన ప్రాంతంలో 150 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. మొత్తం ఐదు చిరుతలు అలిపిరి నుండి మెట్ల మార్గంలో సంచరిస్తున్నట్టుగా అధికారులు గుర్తించారు. చిరుతలను బంధించేందుకు బోన్లను ఏర్పాటు చేశారు.