తిరుపతి:లాక్‌డౌన్ ఎత్తివేసిన తర్వాత భక్తులకు తిరుమల వెంకన్న దర్శనం  కల్పించేందుకు టీటీడీ పాలకవర్గం ప్రయత్నాలు చేస్తోంది. జూన్ 8వ తేదీ నుండి భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించే అవకాశం లేకపోలేదు.

జూన్ 8వ తేదీ నుండి దేవాలయాలకు అనుమతి ఇవ్వాలని కేంద్రం ప్రభుత్వం భావిస్తోంది. ఐదో విడత లాక్ డౌన్ మార్డదర్శకాల్లో భాగంగా దేవాలయాలకు  జూన్ 8వ తేదీన అనుమతి ఇచ్చే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్టుగా ప్రకటించిన విషయం తెలిసిందే.

ఇవాళ మధ్యాహ్నం టీటీడీ ఛైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి వైకుంఠ క్యూ కాంప్లెక్స్ ను పరిశీలించారు. ప్రతి రోజూ 7 వేల మంది భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించేందుకు టీటీడీ ప్లాన్ చేస్తోంది.

గంటకు సుమారు 500 భక్తులను తిరుమల వెంకన్న దర్శనం కల్పించేందుకు టీటీడీ పాలకవర్గం ప్లాన్ చేస్తోంది. మొదటి మూడు రోజుల పాటు టీటీడీ ఉద్యోగులు, సిబ్బందికి మాత్రమే వెంకన్న దర్శనానికి అనుమతి ఇస్తారు. ఆ తర్వాత 15 రోజుల పాటు తిరుపతి, తిరుమల వాసులకు స్వామి వారి దర్శనానికి అనుమతి ఇస్తారు.

also read:సగం ధరకే తిరుపతి లడ్డు: 25 నుండి ఏపీలోని అన్ని జిల్లాల్లో విక్రయాలు

ఈ ప్రయోగం తర్వాత చిత్తూరు వాసులకు కూడ వెంకన్న దర్శనాన్ని కల్పించాలని టీటీడీ బోర్డు భావిస్తోంది. దర్శన టిక్కెట్లను టైం స్లాట్ విధానంలో కేటాయించాలని  టీటీడీ భావిస్తోంది. స్వామి వారి దర్శన టిక్కెట్లను ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచనుంది టీటీడీ.

భక్తులకు వసతి గదుల కేటాయింపు కూడ ఆన్ లైన్ లోనే బుక్ చేసుకొనే అవకాశం కల్పిస్తోంది. అలిపిరి వద్ద టోకెన్ ఉన్న  భక్తులకు మాత్రమే అనుమతి కల్పిస్తారు. అలిపిరి, నడక మార్గంలో తనిఖీలు చేసిన తర్వాతే  భక్తులను అనుమతి ఇవ్వనున్నారు.