ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్ కి అవమానం జరిగిందా..? తిరుమల దర్శనానికి వెళ్లిన ఆయనను టీటీడీ అధికారులు అవమానించారా..? అవుననే సమాధానమే వినపడుతోంది. దీనిపై టీటీడీ నేతలపై పెద్ద ఎత్తున విమర్శలు ఎదురౌతున్నాయి.

అసలు మ్యాటరేంటంటే... జగన్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. ఇటీవల పాదయాత్ర ముగియగా.... అనంతరం జగన్,.. శ్రీవారి దర్శనానికి తిరుమల వెళ్లారు. కాగా.. అక్కడి అధికారులు కనీస ప్రోటోకాల్ కూడా పాటించలేదని తెలుస్తోంది. ప్రతిపక్ష నేత ఆలయానికి వస్తే.. కనీసం స్వాగతం కూడా పలకలేదు.

జేఈఓ అక్కడే ఉండి కూడా.. స్వయంగా వచ్చి జగన్ ని కలవకపోవడం గమనార్హం.  కిందస్థాయి అధికారులను పంపించి చేతులు దులుపుకున్నారు.  కనీస సంప్రదాయలను కూడా జగన్ విషయంలో అధికారులు పాటించలేదనే విమర్శలు వినపడుతున్నాయి. 

స్వామి వారిని దర్శించుకున్న ప్రముఖులను రంగనాయకుల మండపంలో టీటీడీ వేదపండితులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందించడం సంప్రదాయం. ఇలా ప్రముఖులను ఆశీర్వదించే సమయంలో టీటీడీనే ఫొటోలు తీయించి మీడియాకు విడుదల చేస్తుంది. విపక్షనేత జగన్‌ను ఆశీర్వదించి ప్రసాదం అందజేసిన ఫొటోలను టీటీడీ కనీసం విడుదల చేయకపోవడం గమనార్హం. ప్రొటోకాల్‌ లేని పారిశ్రామికవేత్తలు, సినీ రంగం వారికి ఇచ్చిన గౌరవం కూడా టీటీడీ ప్రతిపక్ష నేతకు ఇవ్వకపోవడం దారుణమని అన్ని వర్గాలూ విమర్శిస్తున్నాయి.