టీటీడీ కొత్త ఈవో నియామకం.. అన్నట్లుగానే ప్రక్షాళన మొదలుపెట్టిన చంద్రబాబు
చంద్రబాబు అన్నట్లుగానే ప్రభుత్వ శాఖల్లో ప్రక్షాళన చేపట్టారు. టీటీడీ నుంచే అది మొదలుపెట్టారు. వైసీపీ అనుకూలురుగా ముద్ర వేసుకున్న ధర్మారెడ్డిని టీటీడీ ఈవో బాధ్యతల నుంచి సాగనంపి.. కొత్త అధికారికి బాధ్యతలు అప్పగించారు.
తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త కార్యనిర్వహణ అధికారి (ఈవో)గా సీనియర్ ఐఏఎస్ జే.శ్యామలా రావు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే టీటీడీ ఈవోగా ఏవీ ధర్మారెడ్డి సెలవుపై వెళ్లారు. ఈ నెల 11వ తేదీ నుంచి వారం రోజులపాటు సాధారణ సెలవు మంంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త ఈవో నియామకం నేపథ్యంలో ధర్మారెడ్డిని ఆ బాధ్యతల నుంచి తొలగించింది.
ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం-జనసేన-భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పలు శాఖల్లో ప్రక్షాళన చేపట్టింది. జగన్ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారన్న ముద్ర వేసుకున్న అధికారులపై ఏదో ఒక విధంగా వేటు పడుతోంది. తొలుత సీఎస్‌గా ఉన్న జవహర్ రెడ్డి కూడా ఇదే మాదిరిగా సెలవు పెట్టి.. వెళ్లిపోయారు. ఆ తర్వాత ఆయన స్థానంలో కొత్త సీఎస్‌గా నీరబ్ కుమార్ ప్రసాద్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. అదే మాదిరిగా వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ముద్ర వేసుకున్నారు ధర్మారెడ్డి. టీటీడీలో వైసీపీ నేతలు, ధర్మారెడ్డి చెప్పిందే వేదంగా నడిపించారన్న విమర్శలు లేకపోలేదు.
అలాగే, తాజాగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా తిరుమలకు వెళ్లారు. శ్రీ వారి దర్శనం చేసుకునేందుకు వారు వెళ్లిన సమయంలో అధికారులు ప్రొటోకాల్ పాటించలేదంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో టీటీడీని ప్రక్షాళన చేస్తామని చెప్పారు. అన్నట్లుగానే వేగంగా అడుగులు వేస్తున్నారు.
ఎవరీ శ్యామలా రావు..?
టీటీడీ ఈవోగా నియమితులైన జే.శ్యామలా రావు 1997 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి.
ఉమ్మడి రాష్ట్రంలోనూ పనిచేసిన అనుభవం అయనకు ఉంది. వైద్య, కుటుంబ సంక్షేమం, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలెప్‌మెంట్ తదితర శాఖల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు.
2009-2011 మధ్య కాలంలో విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌గా పనిచేశారు.
గతంలో జగన్ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ జల వనరుల శాఖ సెక్రటరీ, ఉన్నత మండలి ప్రిన్సిపల్ సెక్రటరీగా, చంద్రబాబు ప్రభుత్వం హయాంలో వాణిజ్య పన్నుల శాఖ కమిషనరుగా పనిచేశారు.
తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా నియమితలుయ్యారు.