తిరుమల తిరుపతి కొండపై వెలసిన కలియుగ దైవం శ్రీవెంకటేశ్వర స్వామికి భక్తులు కోట్లల్లో ఉన్నారు. దేశ నలుమూలల నుంచి, అంతెందుకు విదేశాల నుంచి వచ్చి కూడా స్వామి వారిని దర్శించుకునేవారు ఉంటారు. తిరుపతి వెంకన్న ఆలయం నిత్యం భక్తులతో కిట కిట లాడుతూనే ఉంటుంది. భక్తులు ఈ ఆలయానికి ఎలా వస్తుంటారో... స్వామివారికి వచ్చే కానుకలు కూడా అదే రేంజ్ లో ఉంటాయి.

గతేడాది స్వామివారి హుండీ ఆదాయాన్ని టీటీడీ అధికారులు తాజాగా ప్రకటించారు. 2019లో రూ.1.161.74 కోట్ల నగదు హుండీ ఆదాయంగా వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిగ్యూటివ్ ఆఫీసర్ అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు.

శుక్రవారం తిరుమలలోని అన్నమయ్య భవన్ లో ప్రత్యేకంగా విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి మరీ ఈ వివరాలను తెలిపారు. 2018తో పోలిస్తే..... 2019లో స్వామివారి హుండీ ఆదాయం 8.9శాతం పెరిగినట్లు చెప్పారు. 

ఇక 2019లో స్వామివారిని 2,78,90,179మంది భక్తులు దర్శించుకోగా... 2018లో 2,68,02,047 మంది దర్శించుకున్నారు. ఇక 2019లో 6,45,73,250మంది భక్తులకు అన్నప్రాసాదం అందించగా... 2018లో 6,08,76,434 మంది అన్నప్రసాదం అందించారు

ఇదిలా ఉండగా.. సోమవారం (జనవరి 6) వ తేదీన వైకుంఠ ఏకాదశి కావడంతో.. ఆరోజు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ అధికారులు చెప్పారు. ఈ వైకుంఠ ఏకాదశి రోజున భక్తులు స్వామివారిని ఉత్తర ద్వారం నుంచి దర్శించుకుంటారు.