Asianet News TeluguAsianet News Telugu

తిరుమల శ్రీవారి లడ్డూ బరువుపై టీడీపీ విమర్శలు.. కారణమిదే, క్లారిటీ ఇచ్చిన టీటీడీ

తిరుమల శ్రీవారి లడ్డూ బరువు తగ్గిందంటూ తెలుగుదేశం పార్టీ చేసిన విమర్శలపై స్పందించింది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ). వెయింగ్ మెషీన్‌లో సాంకేతిక సమస్య ఏర్పడిందని.. దాంతో మైనస్ 70 అని వుందని తెలిపింది.

ttd gave clarity on tirumala laddoo weight
Author
First Published Nov 10, 2022, 10:11 PM IST

శ్రీవారి భక్తులు పరమ పవిత్రంగా భావించే తిరుమల లడ్డూ బరువు తగ్గిందంటూ తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. 175 గ్రాములు వుండాల్సిన లడ్డూ బరువు ఎంత తూగిందో మీరే చూడాలని ఓ వీడియోను పంచుకుంది. లడ్డూలు చిన్నవిగా ఉండటాన్ని ఓ భక్తుడు నిలదీశాడు. దీంతో కౌంటర్‌లోని ఉద్యోగి లడ్డూని వెయింగ్ మెషీన్‌పై ఉంచడంతో .. అది 90 గ్రాములు తూగినట్లు కనిపించింది. ఇది పెద్ద చీటింగ్ అంటూ సదరు భక్తుడు ఆరోపించాడు. దీనిపై టీటీడీ వివరణ ఇచ్చింది. 

వెయింగ్ మెషీన్‌లో సాంకేతిక సమస్య ఏర్పడిందని.. దాంతో మైనస్ 70 అని వుందని తెలిపింది. అంతేకాకుండా కాంట్రాక్ట్ సిబ్బంది అవగాహనా లోపంతో ... లడ్డూ బరువుపై భక్తులు అపోహలకు గురయ్యారని టీటీడీ అభిప్రాయపడింది. లడ్డూ కౌంటర్ల వద్ద ఇబ్బందులు ఎదురైతే తక్షణం కౌంటర్ అధికారికి తెలియజేయాలని.. ఈ మేరకు టీటీడీ ఏర్పాట్లు చేసినట్లు తెలిపింది. అయితే సదరు భక్తుడికి ఈ విషయం తెలియక తమపై ఆరోపణుల చేశారని టీటీడీ పేర్కొంది. తిరుమల శ్రీవారి లడ్డూ 160 నుంచి 180 గ్రాముల బరువు వుంటుందని తేల్చిచెప్పింది. దీనిపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని భక్తులకు విజ్ఞప్తి చేసింది. అన్ని రకాల తనిఖీలు పూర్తయ్యాకే లడ్డూలను కౌంటర్లకు తరలిస్తామని టీటీడీ పేర్కొంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios