తిరుమల అలిపిరి నడకదారిలో లక్షిత అనే ఆరేళ్ల చిన్నారి చిరుత దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో భక్తల భద్రతపై టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంది.
తిరుమల అలిపిరి నడకదారిలో లక్షిత అనే ఆరేళ్ల చిన్నారి చిరుత దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో తిరుమల ఘాట్, నడక దారిలో భక్తుల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్పందించారు. చిన్నారి ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో అటవీ శాఖ, పోలీస్ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. అనంతరం ధర్మారెడ్డి మాట్లాడుతూ.. అలిపిరిలో శుక్రవారం సాయంత్రం 6.30 గంటలకు చిన్నారి తప్పిపోయిందని చెప్పారు. చిన్నారి ఆచూకీ కోసం దాదాపు 70 మంది సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారని ఈవో తెలిపారు.
సీసీ కెమెరా ఫుటేజ్‌ను బట్టి కాలినడక మార్గంలో చిరుత దాడి ఘటన జరగలేదని.. ఆయితే బాలిక అటవీ ప్రాంతంలోకి ఏమైనా వెళ్లిందా అన్న కోణంలో విచారణ చేపట్టామన్నారు. చిరుతను బంధించేందుకు బోన్లు ఏర్పాటు చేశామన్నారు. భక్తల భద్రతను దృష్టిలో వుంచుకుని సాయంత్రం 6 గంటలకు అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాలను మూసేయాలని దానిపై కసరత్తు చేస్తున్నామన్నారు. ప్రతి పది మీటర్లకు భద్రతా సిబ్బందిని నియమిస్తామని .. ఇదే సమయంలో చిన్నారుల పట్ల భక్తులు అప్రమత్తంగా వుండాలని ధర్మారెడ్డి సూచించారు. చిన్నారి లక్షిత కుటుంబానికి టీటీడీ నుంచి రూ.5 లక్షలు, అటవీ శాఖ నుంచి రూ.5 లక్షలు అందిస్తామని ఈవో పేర్కొన్నారు.
ALso Read: తిరుమలలో చిన్నారిపై దాడి చేసింది చిరుత కాదా?.. ఫారెస్ట్ అధికారులు ఏం చెబుతున్నారంటే..
మరోవైపు.. నడక మార్గంలోని 7వ మైలు నుంచి నరసింహస్వామి ఆలయం వరకు హై అలర్ట్ జోన్‌గా టీటీడీ ప్రకటించింది. ఈ మార్గంలో వచ్చే భక్తులకు ముందు, వెనుక రోప్‌లను ఏర్పాటు చేయనున్నారు. 100 మంది భక్తుల గుంపును అనుమతించేలా చర్యలు చేపట్టనున్నారు. చిరుత కదలికలను గుర్తించేందుకు అత్యాధునిక సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.
