తిరుపతి:  తిరుమల మాజీ  ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిలపై దాఖలు చేసిన  పరువు నష్టం కేసులను కొనసాగించాలని టీటీడీ నిర్ణయం తీసుకొంది.

వీరిద్దరిపై దాఖలు చేసిన పరువు నష్టం కేసులను ఉపసంహరించుకోవడం లేదని టీటీడీ సోమవారం నాడు స్పష్టం చేసింది.

ఈ కేసును కొనసాగిస్తామని తిరుపతి పదో అదనపు జిల్లా జడ్జి వద్ద టీటీడీ సోమవారం నాడు మెమో దాఖలు చేసింది.

2018లో వీరిద్దరిపై టీటీడీ పరువు నష్టం దావా దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ దావా వేసిన సమయంలో  ఏపీ రాష్ట్రంలో చంద్రబాబునాయుడు ప్రభుత్వం అధికారంలో ఉంది.  

also read:టీటీడీ పరువు నష్టం ఉపసంహరణ పిటిషన్: ఇంప్లీడ్‌తో బయటపడిన వాస్తవం

వెంకటేశ్వరస్వామి హుండీలో డబ్బులు వేయవద్దు, పింక్ డైమండ్ ను విదేశాల్లో వేలం వేశారంటూ రమణ దీక్షితులు  అప్పట్లో విమర్శలు చేశారు. ఈ విమర్శలను సమర్ధిస్తూ విజయసాయిరెడ్డి కూడ పలు ఆరోపణలు చేయడంతో టీటీడీ వారిపై పరువు నష్టం దావా వేసిన విషయం తెలిసిందే.

ఈ నెల 14వ తేదీన తెలంగాణకు చెందిన హిందూ జనసేన శక్తి వేల్పేర్ అసోసియేషన్ ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసింది. దీంతో టీటీడీ ఈ కేసును ఉపసంహరించుకొనేందుకు పిటిషన్ దాఖలు చేసిన విషయం వెలుగు చూసింది. ఈ విషయమై విమర్శలు రావడంతో పరువు నష్టం దావా కేసును కొనసాగించాలని టీటీడీ నిర్ణయం తీసుకొంది.