ఆనంద నిలయం అనంత స్వర్ణమయం ప్రాజెక్ట్ తిరిగి చేపట్టే అవకాశం లేదని తేల్చి చెప్పేశారు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. ప్రాజెక్ట్‌కు విరాళాలు ఇచ్చిన దాతలు వెనక్కి తీసుకోవచ్చని ఆయన తెలిపారు.

శనివారం టీటీడీ పాలక మండలి సమావేశం ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ... గరుడ వారధి పనులు ఆగవన్నారు. దీనికి సంబంధించి వచ్చే ఆర్ధిక సంవత్సరంలో నిధులు కేటాయిస్తామని సుబ్బారెడ్డి పేర్కొన్నారు.

తిరుమలలో పర్యావరణ సంరక్షణకు గ్రీన్ పవర్ వినియోగించాలని బోర్డు నిర్ణయించిందని ఛైర్మెన్ వివరించారు. తిరుచానూరు పద్మావతి అమ్మవారికి 11 కిలోల బంగారంతో సూర్యప్రభ వాహనం చేయించాలని నిర్ణయించామని చైర్మెన్ తెలిపారు.

భక్తుల రద్దీ తక్కువగా ఉండటంతో తిరుమలలో కాటేజీల ఆధుకరణ చేయాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. అంతకుముందు టీటీడీ ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం.

స్వామి వారికి భక్తులు సమర్పించిన ఆస్తులకు సంబంధించి శ్వేత పత్రం విడుదల చేశారు. దేశవ్యాప్తంగా 1,128 ఆస్తులు, 8,088 ఎకరాల విస్తీర్ణంలో ఆస్తులు ఉన్నట్లు వెల్లడించింది.

దేశవ్యాప్తంగా వున్న ఆస్తులను ఏ విధంగటా వినియోగంలోకి తీసుకురావాలని పరిశీలన కోసం కమిటీని నియమించామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. వైకుంఠ ఏకాదశ సందర్భంగా పది రోజుల పాటు వైకుంఠ ద్వారాలను తెరిచి వుంచాలని నిర్ణయించినట్లు వైవీ తెలిపారు.

కోర్టు ఆదేశాల మేరకు ఆస్తుల పరిశీలన కోసం కమిటీని నియమించామని ఆయన పేర్కొన్నారు. మఠాధిపతులు, పీఠాధిపతుల అంగీకారంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు.