పబ్లిసిటీ కోసమే ఇలా , వాలంటీర్ల జోలికొస్తే ఊరుకునేది లేదు .. పవన్ కళ్యాణ్‌కు వైవీ సుబ్బారెడ్డి వార్నింగ్
వాలంటీర్లపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. పబ్లిసిటీ కోసమే వాలంటీర్లపై పవన్ కల్యాణ్ ఆరోపణలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు.

వాలంటీర్లపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు భగ్గుమంటున్న సంగతి తెలిసిందే. తాజాగా టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సైతం పవన్‌పై విమర్శలు గుప్పించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పబ్లిసిటీ కోసమే వాలంటీర్లపై పవన్ కల్యాణ్ ఆరోపణలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఎవరో రాసిన స్క్రిప్ట్‌ను పవన్ చదువుతున్నారని.. వాలంటీర్లపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని వైవీ సుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజలకు సేవ చేస్తున్న వాలంటీర్లపై ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడితే ఊరుకునేది లేదని ఆయన వార్నింగ్ ఇచ్చారు. సెప్టెంబర్‌లో జగన్ విశాఖలో పర్యటిస్తారని.. వైసీపీని నమ్ముకున్న అందరికీ జగన్ న్యాయం చేశారని సుబ్బారెడ్డి కొనియాడారు. ఎన్ని పార్టీలు, ఎందరు కలిసొచ్చినా ప్రజలు జగన్‌వైపే వుంటారని ఆయన జోస్యం చెప్పారు. జగన్‌ను గద్దె దింపాలంటే మూడు పార్టీలు ఏకం కావాల్సి వస్తోందని.. అంటే జగన్ అంత స్ట్రాంగ్ అని సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు.
ALso Read: కడుపైనా చేయాలంటాడు: బాలయ్యపై జగన్, "పవన్ లోబరుచుకుని వదిలేస్తాడు"
అంతకుముందు పవన్ కల్యాణ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు సీఎం వైఎస్ జగన్. అమ్మాయిలను లోబర్చుకొని పెళ్లి చేసుకోవడం, కాపురం చేసి వదిలేయడం పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ అని ఎద్దేవా చేశారు. ఇలాంటి వ్యక్తా వాలంటీర్ల గురించి మాట్లాడేది ఆయన ప్రశ్నించారు. ఒకరితో వివాహ బంధంలో ఉంటూ మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తి వాలంటీర్ల గురించి మాట్లాడుతున్నారని సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకడిదేమో బాబుతో పొత్తు... బీజేపీతో కాపురం అంటూ పరోక్షంగా పవన్ కళ్యాణ్ పై సెటైర్లు వేశారు జగన్.
వాలంటీర్ల క్యారెక్టర్ ఎలాంటిదో సేవలందుకుంటున్న కోట్ల మందికి తెలుసునని జగన్ చెప్పారు. వాలంటీర్లపై తప్పుడు మాటలకు నిర్మాత చంద్రబాబైతే, మాటలు, డైలాగ్ లు, నటనంతా దత్తపుత్రుడిదని జగన్ కౌంటరిచ్చారు. వాలంటీర్ల క్యారెక్టర్లను తప్పుబట్టిన చంద్రబాబుకు పదేళ్లుగా వాలంటీర్ గా ప్యాకేజీ స్టార్ పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. క్యారెక్టర్ లేని వాళ్లంతా వాలంటీర్ల గురించి మాట్లాడుతారా అని పవన్ కళ్యాణ్ పై మండిపడ్డారు సీఎం జగన్. నాలుగేళ్లకో పెళ్లి చేసుకునేవాడు వాలంటీర్లను విమర్శిస్తున్నాడని జగన్ ఫైర్ అయ్యారు.